
హైదరాబాద్‌లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
25 శాతం మాత్రమే నడపాలని ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు సుమారు ఆరునెలల తర్వాత రోడ్డెక్కనున్నాయి. రేపటి నుంచి హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రవాణాశాఖకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే 25 శాతం బస్సులను మాత్రమే నడిపేందుకు ఆయన అనుమతించారు. పరిస్థితిని బట్టి దశల వారీగా బస్సుల సంఖ్యను పెంచనున్నారు.
నగరంలో ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఈరోజు సీఎం కేసీఆర్‌తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ చర్చించారు. ఈ క్రమంలో బస్సులు నడిపేందుకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఏయే రూట్లలో బస్సులు నడపాలనే దానిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకుని రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత బస్సులు నడపాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రకు కూడా రేపటి నుంచే ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించనున్నారు.
Advertisement