అన్‌లాక్‌ 4 : మరిన్ని ప్యాసింజర్‌ రైళ్లు నడిపేందుకు సిద్ధం

దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 4 ప్రారంభమైన నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు మొదలుపెట్టింది. అధిక

Updated : 01 Sep 2020 19:46 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 4 ప్రారంభమైన నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు మొదలుపెట్టింది. అధిక డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో  ఇప్పుడున్న వాటికి అదనంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇందు కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. మరో వంద రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను రైల్వే శాఖ హోంశాఖకు పంపింది. హోంశాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ప్యాసింజర్ రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ.. ఎక్కువగా ప్రయాణికులు ఉండే మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పాయి. పలు పట్టణాల్లో సబర్బన్‌ రైళ్లు నడిపేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో  230 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 4 నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మెట్రో రైల్‌ సేవలు ఈ నెల 7 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని