ఈ ఘనత మీది.. ఈ చరిత మీది: రామోజీరావు

ఈటీవీ రజతోత్సవం జరుపుకొంటున్న వేళ రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 27 Aug 2020 19:03 IST

ఈటీవీ రజతోత్సవ వేళ సందేశం

హైదరాబాద్‌: ఈటీవీ రజతోత్సవం జరుపుకొంటున్న వేళ రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం దేశ, విదేశాల్లోని తెలుగు వారిదని.. ఈ ఘనత, చరిత ప్రేక్షకులదేనంటూ మనసారా ధన్యవాదాలు తెలిపారు. సకుటుంబ సమేతంగా ఛానల్‌ను చూసేలా ప్రయాణం ప్రారంభించిన ఈటీవీ.. ఇప్పటికీ అదే నిబద్ధతతో ముందుకు సాగుతోందన్నారు. ఇకముందూ తెలుగువారికి ఎప్పటిలా ఈటీవీ తిరుగులేని వినోదాలు అందిస్తుందని మాటిచ్చారు. రామోజీరావు సందేశం యథాతథంగా..

‘‘ఈటీవీ పుట్టి ఈనాటికి పాతికేళ్లు. ప్రసారాలు ప్రారంభించిన మొదటిరోజు నుంచే తెలుగు ప్రేక్షకులు ఈటీవీని అమితంగా ప్రేమించారు.. అభిమానించారు. మీ ఆదరణ, ఆశీస్సులు ఎంతో విలువైనవి.. వెలకట్టలేనివి. అందుకే ఈ విజయం దేశదేశాల్లోని తెలుగు ప్రజలందరిదీ. ఈ ఘనత మీది, ఈ చరిత మీది.. మనసారా ధన్యవాదాలు. పొత్తిళ్లలోని బిడ్డ మన కళ్ల ముందే పెరిగి పేరు తెచ్చుకుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ పాతిక సంవత్సరాల పేజీలు ఒకసారి వెనక్కి తిప్పుతుంటే వార్తా రంగంలో..వినోదాల ప్రపంచంలో ఈటీవీ అధిగమించిన మైలురాళ్లు, ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఎదురుగా కదలాడుతున్నాయి. 

ఈటీవీ ప్రారంభించిన రోజే నేను ఒక మాటిచ్చాను. ఈటీవీలో ప్రసారమయ్యే ఏ కార్యక్రమమైనా అందంగా, ఆరోగ్యకరంగా ఉంటుందనీ.. అనుభూతిని కలిగించి ఆలోచన రేకెత్తిస్తుందని చెప్పాను. ఈరోజు వరకు ఈటీవీ ఈ నిబద్ధతను నిజాయతీగా పాటించింది. ప్రయోగం లేకపోతే ప్రయాణమే లేదు.. కొత్తను ఎప్పుడూ ఆహ్వానించాల్సిందే. అలా అని ప్రతి కొత్తనీ ఆహ్వానిస్తే అది ప్రమాదకరం కావొచ్చు. ఈ నిజాన్ని గుర్తెరిగి నడుచుకుంది ఈటీవీ. అందుకే ఈరోజుకీ సకుటుంబంగా చూడగల చక్కటి ఛానల్‌గా మీ మన్ననలు అందుకుంటోంది. 

ఇందుకు కారణమైన ఎంతోమంది నటీనటులు, రచయితలు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, కేబుల్‌ ఆపరేటర్లు, ప్రకటనకర్తలు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈటీవీ కార్యనిర్వాహక బృందం, సిబ్బంది.. వీళ్లందరి నిర్విరామకృషికి ఫలితమే నేటి ఈ వెండి వేడుక. నా కుటుంబసభ్యులైన ఈటీవియన్స్‌ అందరినీ మనసారా అభినందిస్తూ తెలుగువారికి ఈటీవీ ఎప్పటిలా తిరుగులేని వినోదాన్ని అందిస్తుందని వినమ్రంగా తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు.

ఈటీవీ రజతోత్సవం సందర్భంగా సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో వేడుకలు నిర్వహించారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మనవడు సుజయ్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ వేడుకల్లో ఈనాడు ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, డాల్ఫిన్‌ హోటల్స్‌ ఎండీ విజయేశ్వరి, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ రామ్మోహనరావు, ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి, ఈటీవీ సీఈవో బాపినీడు తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని