ఈ రిటైర్డ్ ఉద్యోగి.. ఇప్పుడు మెడిసిన్‌ విద్యార్థి

రిటైర్మెంట్‌.. ఉద్యోగిగా ఏళ్ల తరబడి నిర్విరామంగా పనిచేసి అలసిపోయి విశ్రాంతి తీసుకునే సమయం. సాధారణంగా చాలా మంది పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఎలాంటి టెన్షన్స్‌ లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. పుస్తకాలు

Updated : 26 Dec 2020 16:08 IST

భువనేశ్వర్‌: రిటైర్మెంట్‌.. ఉద్యోగిగా ఏళ్ల తరబడి నిర్విరామంగా పనిచేసి అలసిపోయి విశ్రాంతి తీసుకునే సమయం. సాధారణంగా చాలా మంది పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఎలాంటి టెన్షన్స్‌ లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. పుస్తకాలు చదవడం, మనవళ్లు మనవరాళ్లతో ఆడుకోవడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం లేదా ఇంకేదైనా ఇష్టమైన వ్యాపకంతోనే సమయం గడుపుతుంటారు. కానీ ఒడిశాకు చెందిన రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి జయ్కిశోర్‌ప్రధాన్‌ అందరిలా ఆలోచించలేదు. 64ఏళ్ల వయసులో డాక్టర్‌ కావాలనుకున్నారు. వైద్యవృత్తి మీద ఉన్న ఇష్టంతో మళ్లీ పుస్తకాలు పట్టుకున్నారు. కష్టమైన వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో అర్హత సాధించి ఎంబీబీఎస్‌ తొలి సంవత్సరంలో చేరారు. 

ఒడిశాలోని బార్‌గఢ్‌కు చెందిన కిశోర్‌ ప్రధాన్‌కు చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలని ఉండేది. ఇందుకోసం 1974లో తొలిసారి వైద్యవిద్య ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. అయితే అందులో అర్హత సాధించకపోవడంతో తన కలలను పక్కనబెట్టి బీఎస్సీలో చేరారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకుని టెలికాం రంగంలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 1983లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో చేరారు. అయితే తాను బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగానే కిశోర్‌ తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఏళ్ల తరబడి చికిత్స అందించినా ఆయన బతకలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాస్థితిలో ఉన్న కిశోర్‌.. ఎలాగైనా తాను డాక్టర్‌ అయి ఇలాంటివారి ప్రాణాలను కాపాడాలని నిశ్చయించుకున్నారు. 

దీంతో కిశోర్‌లో మెడిసిన్‌ చదవాలనే కసి మరింత పెరిగింది. కానీ అప్పుడు వైద్యవిద్య ప్రవేశ పరీక్షకు గరిష్ఠ వయసు పరిమితి ఉండటంతో ఆయనకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు మెడిసిన్‌ ప్రవేశాలకు గరిష్ఠ వయసు పరిమితిని తొలగించడంతో కిశోర్‌ ఈ ఏడాది నీట్‌ ప్రవేశ పరీక్ష రాశారు. అందులో మంచి ర్యాంకు సాధించిన ఆయన.. భువనేశ్వర్‌లోని వీర్‌సురేంద్రసాయి ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో చేరారు. ఇటీవలే డాక్టర్ కోర్సు చదువుతున్న తన పెద్ద కుమార్తె కూడా అనారోగ్యంతోనే ప్రాణాలు కోల్పోవడం ఆయన జీవితంలో మరో బాధాకరఘట్టం.

సాధించాలనే తపన, చదవాలనే ఆసక్తి ఉంటే వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే అని చెప్పే కిశోర్‌.. తాను బతికున్నంత కాలం ప్రజలకు సేవ చేస్తానని అంటున్నారు. వైద్యవృత్తి మీదున్న ఇష్టంతో ఆయన రెండో కూతురును కూడా మెడిసిన్‌ చదివిస్తున్నారు. సంవత్సరాలుగా కోచింగ్‌ తీసుకునే విద్యార్థులే కష్టంగా భావించే నీట్‌ పరీక్షలో.. కిశోర్‌ తన 64ఏళ్ల వయసులో ఉత్తీర్ణత సాధించడం నిజంగా విశేషమే. ఆయన పట్టుదల నేటి తరానికి ఆదర్శప్రాయం.దేశంలోనే ఇంత వయస్సులో వైద్యవృత్తి చేరడం ఇదే తొలిసారని కొందరు వైద్యనిపుణులు ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి..  పూజాదేవి.. తొలి మహిళా బస్సు డ్రైవర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని