ఆ విద్యార్థులు.. పరీక్షలకు వద్దు!

కరోనా లక్షణాలతో ఎవరైనా విద్యార్థి పరీక్ష రాయడానికి వస్తే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి పంపాని తాజా మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది.

Published : 11 Sep 2020 14:29 IST

కరోనా వేళ పరీక్షలు: తాజా మార్గదర్శకాలివే..!

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ విద్యార్థుల ప్రవేశ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో అనుసరించే స్టాండర్డ్‌ ఆపరేటింట్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ)లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. కరోనా లక్షణాలతో ఎవరైనా విద్యార్థి పరీక్ష రాయడానికి వస్తే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి పంపాలని తాజా మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. వారికి మరో తేదీన లేదా వేరే మార్గంలో పరీక్ష రాసే ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు సవరించిన ఎస్‌ఓపీను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. లక్షణాలున్న వారు పరీక్ష రాయలనుకుంటే వారికి కూడా అవకాశం కల్పించాలని గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో తెలిపింది. తాజాగా ఈ వెసులుబాటును తొలగించింది. ఇది పరీక్షలు నిర్వహించే అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. కేవలం కొవిడ్‌ లక్షణాలు లేని విద్యార్థులు, సిబ్బంది మాత్రమే పరీక్షా కేంద్రాలకు రావాలని స్పష్టంగా పేర్కొంది. ఒకవేళ లక్షణాలున్న వారు పరీక్షకు హాజరైతే వారిని అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పరీక్ష నిర్వాహణ అధికారులు తీసుకోవచ్చని తెలిపింది.

ఇక కంటైన్‌‌మెంట్‌ జోన్లలో ఉండే పరీక్ష నిర్వాహకులు, సిబ్బందికి పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదని ఇదివరకు ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. వీటితోపాటు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బందికి తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ల వంటివి అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని