త్వరలో 20వేల పోలీస్‌ ఉద్యోగాల భర్తీ

తెలంగాణలో త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు ..

Updated : 23 Oct 2020 16:32 IST

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్: తెలంగాణలో త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా 18,428 మంది ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన 1162 ఎస్సైల పాసింగ్ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 256 మంది మహిళా ఎస్సైలు ఉన్నారు.

తాజా మార్పులకు అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకొని సమయోచితంగా, రాజ్యాంగ బద్దంగా పోలీస్ అధికారులు పనిచేయాలని మహమూద్‌ అలీ కోరారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు గుర్తింపు ఉందని దానిని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. నూతన సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ పోలీస్ శాఖకు అధిక బడ్జెట్‌ కేటాయిస్తున్నామన్నారు.  కరోనా, భారీ వర్షాల్లోనూ పోలీసులు అందించిన సేవలను హోం మంత్రి కొనియడారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలని అన్నారు.

సాంకేతికతను విరివిగా వాడండి: డీజీపీ

నిజాయితీ, నిబద్ధతతో పని చేసి పోలీస్‌ శాఖకు మంచి పేరు తేవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు. విధి నిర్వహణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలన్నారు. సీఎం విజన్‌ మేరకు నేరరహిత సమాజాన్ని కల్పించాలన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యపడుతుందని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖకు ప్రాధాన్యత ఉందని, అందుకే పోలీస్‌ శాఖకు పెద్ద ఎత్తున నిధులు, నియామకాలు జరిగాయని అన్నారు. పేదలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పారు. ‘‘సమాజంలో మార్పు పోలీసులతోనే సాధ్యం. ప్రభుత్వ పథకాల అమల్లోనూ పోలీస్‌ శాఖ భాగస్వామ్యం కావాలి’’ అని మహేందర్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని