ఈ రాష్ర్టాల్లో తెరుచుకోనున్న స్కూళ్లు  

కొవిడ్‌ దాటికి దాదాపు ఐదు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం

Published : 21 Sep 2020 00:59 IST

కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, సూచనలు పాటిస్తూ..

న్యూదిల్లీ : కొవిడ్‌ దాటికి దాదాపు ఐదు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం నియమాలు పాటిస్తూ కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దేశంలో కరోనా విజృంభించటంతో విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ఈ ఏడాది విద్యా సంస్థలు మూతబడ్డాయి. సాధారణంగా జూన్‌ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు సంబంధించి విద్యా సంస్థలు కార్యకలాపాలు జరపటానికి అన్‌లాక్‌ 4లో అనుమతి ఉండటంతో పాఠశాలలు పునఃప్రారంభించటానికి కొన్ని రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.

* ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి పాఠశాలల తెరుచుకోనున్నాయి. కంటైన్మెంట్‌ జోన్‌ పరిధి బయట ఉండే విద్యార్థులు బడులకు వెళ్లేందుకు సంబంధించిన నియమ నిబంధనలను అధికారులు విడుదల చేశారు. అసోంలోనూ ప్రభుత్వ బడులు పునఃప్రారంభం కానున్నాయి. హరియాణా ప్రభుత్వం కూడా సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 50 శాతం సిబ్బందితో పాఠశాలలు నడపటానికి కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌ విద్యాశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్‌లో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు తెరవటానికి అనుమతి ఇవ్వని అక్కడి ప్రభుత్వం పీహెచ్‌డీ స్కాలర్లు, టెక్నికల్‌ కోర్సులు చేసే పీజీ విద్యార్థులు తరగతులకు హాజరవ్వొచ్చని వివరించింది.

* పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్రం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను విడుదల చేసింది. దీంతో పాటు బడులు తెరవడంపై తుది నిర్ణయం ఆయా రాష్ట్రాలదేనని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో దిల్లీ, గుజరాత్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌  రాష్ట్రాలు విద్యాసంస్థల పునఃప్రారంభానికి విముఖత చూపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని