విశాఖపై తీవ్రంగా వాయుగుండం ప్రభావం

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పాడిన తీవ్ర వాయుగుండం విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. తీవ్రవాయుగుండం  ప్రభావం వల్ల కురిసిన వ‌ర్షాలకు వాగులు వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. ...

Published : 13 Oct 2020 11:25 IST

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వ‌ర్షాలకు వాగులు వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని శార‌ద‌, వరాహ‌, తాండ‌వ నదుల్లోకి పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ప్రవాహ ఉద్ధృతికి పాయ‌క‌రావుపేట‌, యల‌మంచిలిలోని కొన్ని లోత‌ట్టు  ప్రాంతాలు నీట‌మునిగాయి. తీర ప్రాంతంలో జాలర్ల బోట్లు ఒడ్డుకు కొట్టుకువ‌చ్చాయి. విశాఖ‌లో బంగ్లాదేశ్‌కి చెందిన వాణిజ్య ఓడ యాంక‌ర్లు కొల్పోయి అర్ధరాత్రి విశాఖ‌న‌గ‌రంలోని తెన్నేటి పార్కు స‌మీపానికి కొట్టుకొచ్చింది. దీనిని మ‌ళ్లీ స‌ముద్రంలోకి పంపేందుకు కొస్ట్ గార్డు రంగంలోకి దిగింది.

ఈ ఉద‌యం కాకినాడ వద్ద తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం విశాఖ వ్యాప్తంగా తీవ్ర అల‌జ‌డి సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా రాత్రంతా విస్తారంగా వ‌ర్షాలు కురిసాయి. జిల్లాలోని సాగ‌ర‌తీరమంతా అల్లకల్లోలం కావ‌డంతో ప‌లు నాటు ప‌డ‌వలు ఒడ్డుకు కొట్టుకు వ‌చ్చాయి. తాండవ నదిలో పెరిగిన వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాండవ రిజ‌ర్వాయరు నుంచి న‌దిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట తీరం ఉప్పుటేరు పొంగి మత్స్యకారుల బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. యలమంచిలి పట్టణంలో పలు కాలనీలు ముంపునకు గుర‌య్యాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు వృక్షాలు నేల కూలాయి. గొస్తని, శారదా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు మండలం రాయిగెడ్డ వద్ద మత్స్యగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కోనాం జలాశయం పూర్తి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా..ప్రస్తుతం 100.25 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పెద్దేరు జలాశయం పూర్తి నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136.20 మీటర్లుగా ఉంది. రైవాడ జలాశయ పూర్తి నీటిమట్టం 114 మీటర్లు కాగా, ప్రస్తుత 113.60 మీటర్లుగా న‌మోదైంది. 

తాండవ జలాశయం మూడుగేట్లు ఎత్తివేసి, 12వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్ రాయవరం మండలం దార్లపూడి వద్ద వరాహ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నక్క మండ‌లం గొడిచెర్ల ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో వ‌రి పంట నీట మునిగింది. వాయుగుండం కార‌ణంగా జిల్లాలో నిన్నటి నుంచి 33కేవీ ఫీడ‌ర్లో దాదాపు 18 చోట్ల, 11 కేవీ ఫీడర్లో 38 చోట్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించామని తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు వెల్లడించారు. వ్యక్తిగత విద్యుత్తు కనెక్షన్లకు సంబంధించి అత్యవసర సిబ్బంది విద్యుత్‌ పునరుద్ధరణ చేస్తున్నట్లు విశాఖ జిల్లా విద్యుత్‌ ఎస్ఈ ఏవివి సూర్య ప్రకాశ్‌ తెలిపారు. చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లలో ఇబ్బందులు వ‌చ్చాయ‌ని, వాటిని సరిచేసే పనిలో ఉన్నామని వెల్లడించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని