
ప్రమాదం అంచున మరో టేబుల్ టాప్ విమానాశ్రయం...
సిమ్లా: కేరళలోని కొలికోడ్‌లో శుక్రవారం చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై అదుపుతప్పి 35 అడుగుల లోయలో పడిపోయింది. దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటన, గతంలో మంగుళూరులో జరిగిన ప్రమాదాన్ని గుర్తు తెచ్చింది. ఈ రెండూ టేబుల్ టాప్ రన్‌వేలపైనే చోటుచేసుకోవలం గమనార్హం. ఇదే విధమైన ప్రమాదం దేశంలో మరో విమానాశ్రయానికి కూడా పొంచి ఉందని నిపుణులు అంటున్నారు.
కొలికోడ్ మాదిరిగానే...
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని జుబ్బార్‌హట్టి ప్రాంతంలో సిమ్లా విమానాశ్రయం నెలకొని ఉంది. అయితే దీనిలో కేవలం దేశీయ ప్రయాణాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. సగటున నెలకు 12 నుంచి 15 దేశీయ విమానాలు ఇక్కడకు రాకపోకలు జరుపుతుంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఉడాన్ పథకం క్రింద హెలికాప్టర్ షటిల్ (హెలిట్యాక్సీ) సేవలను కూడా అందిస్తున్నారు. సముద్రమట్టానికి 2196 మీటర్ల ఎగువన ఉన్న సిమ్లా విమానాశ్రయం రన్‌వే కూడా, ప్రమాదం పొంచి ఉన్న ‘టేబుల్ టాప్ రన్‌వే’ అని విమానయాన నిపుణులు అంటున్నారు.
ల్యాండింగ్ కత్తి మీద సామే
విమానాల ల్యాండింగ్‌కు పరిమిత ప్రదేశం మాత్రమే ఉండటం వల్ల.. అదుపు తప్పితే పరిణామాలు ఘోరంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయంలోని రన్‌వే పొడవు కేవలం 1200 మీటర్లు. నూతన భద్రతా ప్రమాణాల ప్రకారం 40 సీట్లున్న విమానం ల్యాండ్, టేకాఫ్ అయేందుకు ఇది కనీసం 1500 మీటర్లు ఉండాలి. కొలికోడ్ మాదిరిగానే దీని పరిసరాల్లో కూడా గుంతలు ఉండటంతో ఇక్కడ ల్యాండింగ్ కత్తి మీద సామే అని అధికారులు అంటున్నారు.
వివిధ కారణాలతో విస్తరణ ఆలస్యం
కాగా, మిగిలిన భద్రతా పరమైన అంశాలకు ఢోకాలేనప్పటికీ.. ప్రయాణీకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడి రన్‌వే విస్తరణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్రప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుంచామని వారు తెలిపారు. అయితే సిమ్లా విమానాశ్రయంలో విస్తరణకు అవసరమైన ప్రాంతంలో అటవీ భూములు, ప్రైవేటు భూములు ఉండటంతో ఆలస్యమవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.