Published : 11 Sep 2020 12:01 IST

ఇలా చేస్తే మీ గుండె పదిలం

 

‘‘ఆరోగ్యమే మహా భాగ్యం’’ ఇది చిన్నప్పటి నుంచి అందరూ చెప్పే మాటే. కానీ, పని ఒత్తిడి, ఆర్థిక, కుటుంబ సమస్యల వల్ల చాలా మంది ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా చాలా మంది హృద్రోగ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటివారు గుండె పని తీరును మెరుగు పర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఇది అంత కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూసేద్దామా?

1. సక్రమంగానే పని చేస్తోందా?

సాధారణ మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని తెలిసిందే. కానీ, వయస్సు, వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను బట్టి కొంచెం అటుఇటుగా ఉండే అవకాశమూ ఉంది. అయితే గుండె సక్రమంగా పని చేస్తోందా? ఎన్ని సార్లు కొట్టుకుంటుందో తెలుకోవాలనుకుంటే.. మణికట్టు వద్ద నాడిపై చేతిని పెట్టి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో ఓ 15 సెకన్లపాటు లెక్కించండి. ఆ తర్వాత దానిని 4తో గుణిస్తే నిమిషంలో మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలిసిపోతుంది. ఉదాహరణకు 15 సెకన్లలో మీ నాడి 18 సార్లు కొట్టుకుంది అనుకుందాం. అప్పుడు మీ గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకున్నట్లు లెక్క.

2. వ్యాయామం అలవర్చుకోండి
గుండె పని తీరు మెరుగు పడాలంటే వ్యాయామం తప్పనిసరి. ఆరోగ్యవంతులైన వారిలో హృదయ స్పందన స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా అథ్లెట్లలోనూ, ఏరోబిక్‌ చేసేవారిలో గుండె పని తీరు చక్కగా ఉంటుందని నిపుణులు చెబుతారు. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వాళ్లు మాత్రం వైద్యుల సలహా మేరకే వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే వ్యాయామం చేస్తున్న సమయంలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అది పరిమితిని మించిపోతే ప్రాణానికే ప్రమాదం.

3. తొలుత బరువు తగ్గాలి
గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొన్న వారిలో ఊబకాయులే ఎక్కువ మంది. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నందువల్ల రక్త ప్రసరణకు అది అవరోధంగా మారుతుంది. అంతేకాకుండా గుండె నుంచి శరీరభాగాలకు, శరీరభాగాల నుంచి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు మూసుకుపోయి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల గుండె పని తీరును మెరుగుపర్చుకోవాలంటే ముందుగా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

4. పొటాషియం ఉండేలా చూసుకోండి
గుండె సక్రమంగా పని చేయడానికి పొటాషియం సహకరిస్తుంది. అందువల్ల మనం తినే ఆహరంలో ఇది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. రక్తంలోని పొటాషియం గుండె వేగాన్ని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. పొటాషియం తక్కువైనందువల్ల ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయే ప్రమాదముంది. అరటిపళ్లు, వేరుశెనగ, బంగాళదుంప, టమాటా, అవిసె గింజల్లో సమృద్ధిగా లభిస్తుంది.

5. చేపలు తింటే ఉపయోగమెక్కువ
సాధారణంగా చేపలు ఎక్కువగా తినే వారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువగా ఉంటాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె పని తీరును మెరుగుపరచడమే ఇందుకు కారణం. వారానికి కనీసం రెండుమూడుసార్లు చేపలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. శాకాహారులైతే కనీసం మందులషాపులో లభించిన ఓమెగా-3 క్యాప్సుల్స్‌నైనా ఉపయోగించాలని అంటున్నారు.

6. ఒత్తిడిని తగ్గించుకోండి
గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. మనం దానిని జయించినట్లయితే చాలా వరకు హృద్రోగ సమస్యల నుంచి బయటపడొచ్చన్నది వైద్యుల వాదన. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో చిట్కా పాటిస్తుంటారు. కొందరు అంకెలను లెక్కపెట్టుకుంటే, మరికొందరు తమకు ఇష్టమైన పాటలు వినడమో, లేదా పుస్తకాలు చదవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఒత్తిడి దూరమవుతుందని వారు చెబుతుంటారు. ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లోనే తేలింది.

7. యోగాతో లాభాలెన్నో
శరీరాన్ని, మనసును ఆధీనంలో ఉంచుకోవడానికి యోగా ఓ చక్కని మార్గం. నిత్యం యోగా చేసేవాళ్లు ఎంతో ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా కనిపిస్తుంటారని చాలా సార్లు వినే ఉంటాం. అయితే యోగా వల్ల దీర్ఘ కాలంలో ప్రయోజనాలుంటాయి. దీనివల్ల నరాలు బలంగా తయారై రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని వ్యర్థాలన్నీ  బయటకు పోతాయి.

8. సరిపడినంత నిద్ర
మనిషి ఆరోగ్యవంతంగా జీవించడానికి సరిపడా నిద్ర చాలా అవసరం. రకరకాల సమస్యలు నిద్రలేమితోనే మొదలవుతాయి. మనం పడుకున్న సమయంలో అవయవాలన్నీ విశ్రాంత స్థితిలో ఉండటం వల్ల రక్తపోటు తగ్గి గుండె కొట్టుకునే వేగం తగ్గుంది. సరిగా నిద్రలేకపోవడం వల్ల నిరంతరం పనిచేసే గుండెకు ఆ కొంచెమైనా విశ్రాంతి దొరకదు. దీంతో క్రమంగా రక్తపోటు పెరిగే అవకాశముంటుంది. కనీసం 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయిన వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశమెక్కువ. ఆరోగ్యంగా ఉండాలంటే 7 గంటల నుంచి 9 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు.

9. ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ వాడితే మంచిది
గుండె పని తీరును నిరంతరం గమనించడానికి ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను ఉపయోగిస్తే మంచిదట. ఇది ఒక ఎలక్ట్రానిక్‌ పరికరం. మీరు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు, అలాగే వ్యాయామం చేస్తున్నప్పుడు మీ గుండె వేగాన్ని ఇది లెక్కిస్తుంది. సాధారణ స్థితిలో తక్కువగానూ, వ్యాయామం చేస్తున్న సమయంలో గుండె వేగం ఎక్కువగా ఉండటాన్ని మనం గమనిస్తాం. అయితే గుండె వేగం మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఇది హెచ్చరిస్తుంది. ప్రతిరోజూ దీనిని ఉపయోగిస్తూ వ్యాయామం చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని