కళ్లజోడు..మాస్క్‌? సమస్యకిలా చెక్‌!

ముఖ్యంగా కళ్లజోడు ఉన్నవారికి మాస్కుతో ఇబ్బంది మరీ అధికం. వారు వదిలే ఊపిరి ధరించే కళ్లజోడును మసకబారేలా చేస్తుంది.

Published : 17 Nov 2020 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా వైరస్‌ కట్టడికి మాస్కుల వాడకం కీలకం అని అందరికీ తెలిసిందే. కొవిడ్-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన అనంతరం కూడా వీటి వాడకం తప్పనిసరి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే మాస్కును వాడటం కొన్ని సందర్భాల్లో అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా కళ్లజోడు ఉన్నవారికి ఇది మరీ అధికం. వారు వదిలే ఊపిరి ధరించే కళ్లజోడును మసకబారేలా చేస్తుంది. చదివేటప్పుడు, పనిచేసేటప్పుడు, వాహనాలు నడిపే సమయంలో ఎదుట ఉన్న వస్తువులు కనిపించక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పరిస్థితి కొన్ని సార్లు ప్రమాదాలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. ఇక మాటిమాటికీ కళ్లజోడును తీసి శుభ్రం చేయటం.. తిరిగి ధరించటం ఆచరణలో సాధ్యం కాదు.

అయితే ఈ సమస్యకు  వైద్యుడు డాక్టర్‌ డానియల్‌ ఎం హైఫర్‌మన్‌ అతి సులువైన పరిష్కారాన్ని సూచించారు. చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు వాడే సాధారణ బ్యాండ్‌ ఎయిడ్‌తో దీనికి చెక్‌ పెట్టచ్చని ఆయన తెలిపారు. ముక్కుపైన మాస్క్‌ను ఓ చిన్న బ్యాండ్‌ ఎయిడ్‌తో అంటించడం ద్వారా ఇది సాధ్యమౌతుందని చిత్రం సహాయంతో వివరించారు. ‘‘మీకు కళ్లజోడు ఉన్నపుడు మాస్క్‌ ధరించడం సమస్యగా ఉంటే.. ఓ చిన్న బ్యాండ్‌ ఎయిడ్‌ అద్భుతాలు చేయగలదు. దీనిని నేను ఓఆర్‌ (ఆపరేషన్‌ రూమ్) సమయంలో తెలుసుకున్నా. దీనిని షేర్‌ చేయండి, ఈ చర్య కొన్ని ప్రాణాలను కూడా కాపాడగలదు.’’ అని అయన తెలిపారు.

కాగా, ఈ ఐడియాకు ప్రముఖ అంతర్జాతీయ మోడల్‌ క్రిస్సీ టైగన్‌తో సహా పలువురు నెటిజన్లు ఫిదా అయ్యారు. కళ్లజోడు ధరించే వారికి మాస్కుతో వచ్చే సమస్య అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తుందని.. తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తాము సతమతమౌతున్న సమస్యకు ఇంత సులభమైన పరిష్కారాన్ని సూచించిన డాక్టర్‌ డానియల్‌ ఎం హైఫర్‌మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని