ఇన్‌స్టాగ్రామ్‌.. 4గంటలు.. ప్రపంచ రికార్డు

దిగ్గజ ప్రసారకర్త సర్‌ డేవిడ్‌ అట్టెన్‌బొరో ఓ అరుదైన ఘనత సాధించారు..

Published : 26 Sep 2020 20:36 IST

అరుదైన ఘనత సాధించిన దిగ్గజ ప్రసారకర్త

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిగ్గజ ప్రసారకర్త సర్‌ డేవిడ్‌ అట్టెన్‌బొరో ఓ అరుదైన ఘనత సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత వేగంగా మిలియన్‌ ఫాలోవర్లను సంపాదించుకొని ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రకృతి ప్రేమికుడైన బ్రిటన్‌కు చెందిన అట్టెన్‌బొరో గురువారం మొట్టమొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ప్రపంచం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని మనమందరం ఏకమై భూగోళాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘ఖండాలు అగ్ని గుండాల్లా మారాయి. మంచుకొండలు కరిగిపోతున్నాయి. పగడపు దిబ్బలు కనుమరుగవుతున్నాయి. సముద్ర జీవులు అంతరించిపోతున్నాయి. ఈ జాబితా ఇంకా చాలా పెద్దగా ఉంది. ఈ భూగోళాన్ని కాపాడుకోవడం ఇప్పుడు మనముందున్న అతి పెద్ద సవాలు. ఇందుకోసం ఏం చేయాలో మనకు తెలుసు. అందుకు ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం ఉన్న అవరోధాలు, వాటిని ఎదుర్కొనేందుకు చేయాల్సిన పనులను వీడియోల ద్వారా తెలియజేస్తాను. కొన్ని ఎక్స్‌క్లూజివ్‌ వీడియోలను పంచుకుంటాను. అందుకే నేను ఈ మాధ్యమంలోకి వచ్చాను. ఈ వీడియోలను షేర్‌ చేద్దాం.. సమాజంలో మార్పునకు నడుం బిగిద్దాం. అంటూ మొదటి వీడియో పోస్టు చేశారు. 

డేవిడ్‌ అట్టెన్‌బొరో ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన నాలుగు గంటల్లోనే మిలియన్‌ ఫాలోవర్లను సంపాదించుకొని గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని గిన్నిస్‌ రికార్డు అధికారులు ధ్రువీకరించారు. గతంలో నటి జెన్నిఫర్‌ అనిస్టన్ పేరిట ఉన్న రికార్డును అట్టెన్‌బొరో బద్దలు కొట్టారు. కాగా ఆ వీడియోను ఇప్పటివరకు 14 మిలియన్ల మంది వీక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని