Published : 29 Nov 2020 23:20 IST

లఘు చిత్ర ‘సిరి’

ఇంటర్నెట్‌ డెస్క్‌ : రంగం ఏదైనా సరే.. కృషి, పట్టుదల ఉంటే చాలు. వాటితో ప్రతిభను మెరుగు పరుచుకొంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నిజాయితీగా ప్రయత్నిస్తే ఎంచుకున్న రంగంలో పూలబాటలు వేసుకోవచ్చు. చేసే పనిపై దృష్టి పెడితే అనుకున్న విజయం సొంతం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని నిరూపిస్తోంది అనంతపురం యువతి. లఘుచిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెనే సిరి సిరిఖన్‌కన్. సినిమా రంగానికి చెందిన వారు ఎవరూ లేకున్నా, అభిరుచి అనే ఏకైక ఆయుధంతో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి లఘు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చదువులో రాణిస్తూనే నటిగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

పాఠశాల దశలోనే నటనలో తొలి అడుగులు వేస్తూ, అనేక సాంస్కృతిక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చిందామె. బాలనటిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో నాట్యంలో తర్ఫీదు పొందింది. నటిగా, నాట్యకారిణిగా అనేక వేదికలపై మెరిసింది. వెన్నంటి ప్రోత్సహించిన తల్లి ఆశల్ని నిజం చేస్తూ అనేక అవార్డులను సొంతం చేసుకుంది.

ఇంటర్‌ వరకూ అనంతపురంలోనే చదివిన సిరి ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వెళ్లింది. అక్కడే లఘు చిత్రాలలో నటించే అవకాశాలు ఆమెను పలకరించాయి. నాట్యం, నటనలో పట్టున్న సిరి తక్కువ సమయంలోనే లఘు చిత్రాల్లో తనదైన ముద్రవేసింది. రెండేళ్లలోనే 25కు పైగా లఘుచిత్రాల్లో నటించి నెటిజన్ల అభిమానం దక్కించుకుంది. కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా ప్రతిభకు ఆస్కారం ఉన్న అన్ని రకాల రోల్స్‌ చేస్తూ మెరిసింది. ‘ఓ మధులో’ కళాశాల యువతిగా, ‘1947 ఆగస్టు 14’ అనే లఘు చిత్రంలో నిండు గర్భిణీగా చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆమె ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు మోడలింగ్‌లో అవకాశాలు ఇచ్చాయి. అలా కొన్ని ప్రకటనల్లోనూ నటించిందామె. గత ఏడాది..బెంగళూరులో ఫేమ్‌ ఇండియా నిర్వహించిన అందాల పోటీలో మిస్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది సిరి.

సిరిఖన్‌కన్‌ అసలు పేరు శిరీష. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఆదరణ దక్కించుకోవాలనే తపనతో పేరు మార్చుకుంది. ఆమె తాతయ్య రంగస్థల కళాకారుడు. ఆయన స్ఫూర్తితోనే  నటన పైపు అడుగులు వేసిందామె. అవరోధాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగింది. ఆమెకు సౌందర్య అంటే ఎంతో ఇష్టం. నటిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న సిరి చదువును ఏమాత్రం అశ్రద్ధ చేయటంలేదు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి అత్యధిక మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని