గగనతలంలో నిఘా నేత్రాలు

స్వదేశీ రక్షణ పరిశ్రమకు ఊతమిస్తూ, భారత వైమానికదళ నిఘా సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు డిఫెన్స్‌ రీసెర్ఛ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) ఆరు కొత్త విమానాలను రూపొందించనుంది.

Published : 16 Dec 2020 20:43 IST

దిల్లీ: స్వదేశీ రక్షణ పరిశ్రమకు ఊతమిస్తూ, భారత వైమానికదళ నిఘా సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) ఆరు కొత్త విమానాలను రూపొందించనుంది. వీటి ద్వారా చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భారత వైమానిక దళ నిఘా సామర్థ్యాలు మెరుగుపడనున్నాయి. ప్రభుత్వ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. రూ. 10,500 కోట్లతో ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టులో ఎయిరిండియా నుంచి ఆరు విమానాలను డీఆర్‌డీవో కొనుగోలు చేసి ఏఈడబ్ల్యూ అండ్‌ సీ బ్లాక్‌2 విమానాలను అభివృద్ధి చేయనుంది. వాటిలో 360 డిగ్రీల నిఘా సామర్థ్యం ఉండే రాడార్లను అమర్చనుంది. దీంతో కీలక సమయాల్లో మనకు శత్రువుల సమాచారం మన సైనిక బలగాలకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్న నేపథ్యంలో గతంలో యూరోపియన్‌ సంస్థ నుంచి ఎయిర్‌బస్‌ 330 రవాణా విమానాలను కొనుగోలు చేయాలనుకున్న ప్రతిపాదన పక్కన పెట్టినట్లేనని వారు తెలిపారు. గతంలో ఈ 330 రవాణా విమానాల్లో ఎయిర్‌బోర్న్ వార్నింగ్‌ అండ్ కంట్రోల్‌ సిస్టంలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్దం చేశారు. కానీ అది ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఎయిరిండియా నుంచి తీసుకోనున్న ఆరు విమానాలను రక్షణ వ్యవస్థకు అనువుగా తయారు చేసేందుకు వాటి తయారీదారులైన ఓ యూరోపియన్‌ సంస్థ వద్దకు పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ను పోత్సహించే విధంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. డీఆర్‌డీవోకు ఉన్న గత అనుభవాలతో ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యోచిస్తోంది. గతంలో డీఆర్‌డీవో అందించిన రెండు ‘నేత్ర’ విమానాలు కూడా శత్రు కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు అద్భుతంగా పనిచేస్తున్నాయి.

ఇవీ చదవండి..

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను మాకివ్వండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని