కొబ్బరికాయల కొరత.. చెట్టెక్కిన మంత్రి

దేశం కొబ్బరికాయల కొరతను ఎదుర్కొంటుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓ శ్రీలంక మంత్రి ఏకంగా కొబ్బరి చెట్టు ఎక్కేశారు.

Published : 20 Sep 2020 00:48 IST

దిల్లీ: దేశం కొబ్బరికాయల కొరతను ఎదుర్కొంటోందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో శ్రీలంకకు చెందిన ఓ మంత్రి ఏకంగా కొబ్బరి చెట్టు ఎక్కేశారు. ఇంత కొత్తగా సమస్యను వివరించే ప్రయత్నం చేసిన ఆ మంత్రి పేరు అరుందిక ఫెర్నాండో(శ్రీలంకన్‌ స్టేట్ మినిస్టర్‌ ఆఫ్ కోకోనట్).

అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశీయ వినియోగం, స్థానిక పరిశ్రమల నుంచి ఉన్న డిమాండ్ కారణంగా దేశంలో 700 మిలియన్‌ కొబ్బరికాయల కొరత ఉందంటూ చెట్టుపై నుంచే మంత్రి ప్రసంగించారు. ‘ఎక్కడ కొద్దిపాటి భూమి ఉన్నా, దానిలో కొబ్బరి చెట్లను నాటి, సంబంధిత పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తారని ఆశిస్తున్నాను. దేశానికి విదేశీ మారక ద్రవ్యం అందించే పరిశ్రమల్లో ఇది కూడా ఒకటి’ అని ప్రజలకు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం కాయల ధరలు అధికంగా ఉన్నాయని, ఈ కొరత సమయంలో కూడా వాటి ధర తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని హామీ ఇచ్చారు.

కాగా, సదరు మంత్రి చెట్టు దిగే క్రమంలో చాలా ఇబ్బంది పడ్డారని సమాచారం. ఆయన చెట్టు ఎక్కేందుకు వినియోగించిన పరికరం నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన సహాయకులు చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చిందని ఆ మీడియా సంస్థ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని