
లిబియాలో సిక్కోలు యువకులకు విముక్తి
సంతబొమ్మాళి: ఉపాధి కోసం ఆఫ్రికాలోని లిబియా ప్రాంతానికి వెళ్లి అక్కడ అపహరణకు గురైన సిక్కోలు యువకులకు విముక్తి లభించింది. సంతబొమ్మాళి మండలం నౌపాడ పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను లిబియా భారత దౌత్యాధికారులు ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో విడిపించారు. అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సెప్టెంబర్ 12వ తేదీన భారతదేశానికి వచ్చేందుకు సీతానగరం గ్రామానికి చెందిన బచ్చల జోగారావు, బచ్చల వెంకట్రావు, బొడ్డు దానయ్యలు త్రిపోలి విమానాశ్రయానికి వస్తూ మార్గం మధ్యంలో అదృశ్యమయ్యారు. వీరితోపాటు ఉత్తరప్రదేశ్, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు యువకులు ఆగంతకుల చేతిలో బంధీలయ్యారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు.. లిబియాలో అదృశ్యమైన వారికోసం గాలింపు చేపట్టాలని గత నెల 23న పార్లమెంట్‌లో ప్రస్తావించడంతోపాటు కేంద్రానికి లేఖ రాశారు.
దీనిపై స్పందించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ లిబియాలో ఉన్న భారత దౌత్యాధికారులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లిబియాలో వారికి ఉపాధి కల్పించిన సంబంధిత కంపెనీ యాజమాన్యంతో అధికారులు మాట్లాడగా.. అదృశ్యమైన ఏడుగురు యువకులు ఆగంతకుల చేతిలో బంధీలుగా ఉన్నారని సంబంధిత యాజమాన్యం అధికారులకు తెలిపింది. పలుమార్లు ఆగంతకులతో అక్కడి భారత దౌత్యాధికారులు, కంపెనీ యజమానులు చర్చలు జరిపారు. దీంతో 30రోజుల అనంతరం ఆదివారం అర్ధరాత్రి 2గంటల సమయంలో బంధీలుగా ఉన్న యువకులను ఆగంతకులనుంచి విడిపించినట్లు భారత దౌత్యాధికారులు వెల్లడించారు. అనంతరం వారిని దౌత్యకేంద్రానికి తరలించారు. వారం రోజుల అనంతరం స్వదేశానికి పంపించనున్నట్లు బాధిత కుటుంబసభ్యులు సోమవారం తెలిపారు. దీంతో యువకులను విడిపించిన అధికారులకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.