సౌరశక్తితో వైద్యపరికరాల క్రిమిరహితం

 కేవలం సూర్యకాంతి సాయంతోనే వైద్య పరికరాలను స్టెరిలైజ్‌ చేసే నూతన పద్ధతిని అమెరికాకు చెందిన ఎంఐటీ పరిశోధకులతో కలిసి ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు రూపొందించారు.

Published : 20 Nov 2020 23:50 IST

అభివృద్ధి చేసిన ఎంఐటీ, ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసుపత్రులు, క్లినిక్‌లలో వైద్య పరికరాలను క్రిమిరహితం చేసే నూతన విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. కేవలం సౌరశక్తితోనే వైద్య పరికరాలను స్టెరిలైజ్‌ చేసే నూతన పద్ధతిని అమెరికాకు చెందిన ఎంఐటీ పరిశోధకులతో కలిసి ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎటువంటి విద్యుత్, ఇంధనం అవసరం లేకుండానే ఆసుపత్రులు, క్లినిక్‌లు, దంత వైద్యశాలల్లోని వైద్యపరికరాలను స్టెరిలైజ్‌ చేయవచ్చని నిరూపించారు. ఎంఐటీ, ఐఐటీ బాంబేకి చెందిన మొత్తం పదిమంది పరిశోధకులు ఈ విధాన రూపకల్పనలో పాల్గొన్నారు. ముంబయిలో విజయవంతంగా పరీక్షించిన ఈ నూతన విధాన పరిశోధనా పత్రాన్ని తాజాగా జౌలీ జర్నల్‌లో ప్రచురించారు.

ప్రస్తుతం ఆసుపత్రులు, క్లినిక్‌లలో వైద్య పరికరాలను క్రిమిరహితం చేయడానికి ఆటోక్లేవ్‌లును వినియోగిస్తున్నారు. దాదాపు 125 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అధిక ఒత్తిడితో కూడిన ఆవిరిని సరఫరా చేస్తూ స్టెరిలైజ్‌ చేస్తున్నారు. అయితే, వీటికి కరెంటుతో పాటు ప్రత్యేక బాయిలర్లను వాడుతున్నారు. చాలా గ్రామీణ ప్రాంతాలు, చిన్న క్లినిక్‌లలో క్రిమిరహిత ప్రక్రియ ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సోలార్‌ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో సురక్షితమైన స్టెరిలైజ్‌ చేయవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు.

ప్రయోగాల్లో భాగంగా, కేవలం 2 మీటర్ల సోలార్‌ కలెక్టర్‌ సాయంతోనే ఓ చిన్నపాటి క్లినిక్‌లో స్టెరిలైజ్‌ కోసం వాడే ఆటోక్లేవ్‌కు శక్తిని అందించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. గతకొన్ని సంవత్సరాలుగా పరిశోధన జరుపుతున్న ఎయిరోజెల్‌ పదార్థమే దీనిలో కీలకమని పేర్కొన్నారు. ఇది థర్మల్‌ ఇన్సులేషన్‌ను అందిస్తూ, ఉష్ణ నష్టాన్ని దాదాపు పదిరెట్లు తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సిలీకాతో తయారుచేసిన ఈ పదార్థంలో సముద్రపు ఇసుక, నీటిని ఉపయోగించామని వెల్లడించారు.

సూర్యకాంతి సహాయంతో అధిక ఒత్తిడి కలిగిన ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించామని ఎంఐటీ, ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యరశ్మితో సోలార్‌ ప్లేటు వేడి అయినపుడు వాటికింద అమర్చిన పైపులలోని నీరు వేడి అవుతుంది. వీటితోపాటు కంటికి కనిపించే ఇన్సులేటింగ్‌ మెటీరియల్‌తోపాటు ఇరువైపుల అమర్చిన అల్యూమినియం అద్దాల వల్ల మరింత సూర్యకాంతి పడి అధిక ఉష్ణాన్ని కలిగిస్తుంది. ఇలా ఓ ముప్పై నిమిషాలతో వచ్చే వేడి తీవ్రత వల్ల స్టెరిలైజేషన్‌కు అవసరమైన అధిక ఒత్తిడితో కూడుకున్న ఆవిరిని పొందవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

అయితే, ఈ పద్ధతిలో ఎయిరోజెల్‌ మినహా ఇతర భాగాలన్నీ తక్కువ ఖర్చులోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. కేవలం ఈ ప్రత్యేక పదార్థానికి వాణిజ్యపరంగా మార్కెట్‌ లభిస్తే త్వరలోని దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రత కలిగిన ఉష్ణాన్ని పొందే వ్యవస్థలు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నప్పటికీ సోలార్‌ సహాయంతో అతి తక్కువ ఖర్చుతోనే వీటిని పొందడం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని