టీఎస్‌ హైకోర్టు ఆదేశాలను సవరించిన సుప్రీం

బాణసంచా నిషేధం అంశంలో తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట లభించింది.

Published : 14 Nov 2020 01:30 IST

తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట

దిల్లీ: బాణసంచా నిషేధం అంశంలో తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట లభించింది. బాణసంచాను నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. గాలి నాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. ఈనెల 9న జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలను సవరిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్నచోట టపాసులపై నిషేధం విధించిన సుప్రీం.. గాలి నాణ్యత సాధారణంగా ఉన్నచోట రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రీన్‌ క్రాకర్స్‌కు అనుమతించింది. ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారమే తెలంగాణలో టపాసులపై ఆంక్షలు విధిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

దేశవ్యాప్తంగా గాలి నాణ్యత ఆధారంగా టపాసుల కాల్చివేత, విక్రయాలకు అనుమతివ్వాలని ఇటీవల ఎన్జీటీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై పూర్తిగా నిషేధం విధించింది. గాలి నాణ్యత సాధారణ స్థితిలో ఉంటే అలాంటి ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టపాసులు కాల్చుకునేందుకు ఎన్జీటీ అనుమతించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఎన్జీటీ ఇచ్చిన మార్గదర్శకాను అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో బాణసంచాను నిషేధించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన న్యాయవాది పి.ఇంద్రప్రకాశ్‌ వ్యక్తిగత హోదా(పార్టీ ఇన్‌ పర్సన్‌)లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిషేధం విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిది. ఈక్రమంలో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టు ఇచ్చిన నిషేధం ఆదేశాలను సవరించింది. ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారమే ఆంక్షలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని