సుప్రీం కోర్టులో ఏపీకి చుక్కెదురు

ఏపీ సర్కార్‌కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ ..

Updated : 03 Sep 2020 13:01 IST

దిల్లీ: ఏపీ సర్కార్‌కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం 81, 85 జీవోలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ వాదనలు వినిపించారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని విద్యాహక్కు చట్టంలో లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ ప్రగతిశీల నిర్ణయం తీసుకుందని వాదించారు. తెలుగులో బోధన వల్ల పాఠశాలల్లో నమోదు తగ్గిపోతోందని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై స్పందించేందుకు ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని చెప్పింది. నోటీసులతో స్టేకూడా ఇవ్వాలని విశ్వనాథన్‌ ధర్మాసనాన్ని కోరారు.

ప్రతివాదుల తరఫున సీనియర్‌ న్యాయవాది శంకర్‌ నారాయణన్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు మాధ్యమం ఎంపిక అవకాశాన్ని కాలరాస్తోందన్నారు. తెలుగు మాధ్యమ పాఠశాలలను కనుమరుగు చేసే యత్నం జరుగుతోందని కోర్టుకు తెలిపారు. ప్రతివాదులు అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాత స్టేపై పరిశీలిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేవియట్‌ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 25కి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని