బంగారంతో మిఠాయిలు.. కిలోకు రూ.9వేలు..!

మిఠాయిల్లో నేతి, డ్రైఫ్రూట్స్‌ ఇలా రకరకాల పదార్థాలతో చేసిన వాటిని ఇదువరకు మనం చూసుంటాం. కానీ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ దుకాణదారుడు విభిన్నమైన రీతిలో స్వీట్స్‌ తయారు చేసి అందరి చూపును ఆకర్షిస్తున్నాడు.

Published : 01 Nov 2020 01:14 IST

గాంధీనగర్‌: మిఠాయిల్లో నేతి, డ్రైఫ్రూట్స్‌ ఇలా రకరకాల పదార్థాలతో చేసిన వాటిని ఇదివరకు మనం చూసుంటాం. కానీ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ దుకాణదారుడు విభిన్నమైన రీతిలో స్వీట్స్‌ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా భావించే ‘ఘారి’ అనే మిఠాయిని ఏకంగా బంగారంతో తయారు చేసి స్వీట్స్‌ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేశాడు. మరి ఆ బంగారు ఘారి విశేషాలు, దాని ధర ఎంతో తెలుసుకుందాం. 

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లో చండీ పడ్వా అనేది ఓ ముఖ్యమైన పండగ. శరద్‌పూర్ణిమ తర్వాత రోజున ఈ పండగను జరుపుకొంటారు. ప్రధానంగా ఈ పండగకు గుజరాత్‌ ప్రజలు ఘారి అనే స్వీట్‌ను తయారుచేసుకుని ఇష్టంగా తింటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏదైనా ప్రత్యేకంగా తయారు చేయాలని భావించిన ఓ దుకాణ యజమాని బంగారంతో ఘారిని తయారుచేసి ఆశ్చర్యపరిచాడు. బంగారు ఘారి అంటే దాంట్లో అంతా బంగారం ఉంటుందని దానర్థం కాదు. స్వీట్‌ పైభాగంలో మాత్రం బంగారు తాపనం ఉంటుందని ఫొటోల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా దుకాణ యజమాని రోహన్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది బంగారు ఘారిని తయారు చేశాం. ఇది ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేదంలోనూ బంగారాన్ని మంచి ప్రయోజనకర పదార్థంగా చెప్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్వీట్‌కు మేం ఊహించిన దానికన్నా తక్కువే డిమాండ్‌ వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో మంచి స్పందన వస్తుందని అనుకుంటున్నాం. ఈ గోల్డ్‌ ఘారీ ధర కిలోకు రూ.9వేలు. సాధారణ ఘారీ మిఠాయి అయితే కిలోకు రూ.660 నుంచి రూ.820 ధర ఉంటుంది’అని చెప్పారు. ప్రస్తుతం ఈ స్వీట్స్‌కు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని