పాలకొల్లు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ప్రమాదం తప్పింది. వరద ముంపులో ఉన్న లంక గ్రామాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే బయల్దేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న ఇంజన్‌ పడవ గోదావరి మధ్యలో మరమ్మతుకు...

Updated : 13 Sep 2023 17:05 IST

యలమంచిలి(ప.గో): తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ప్రమాదం తప్పింది. వరద ముంపులో ఉన్న లంక గ్రామాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే బయల్దేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న ఇంజన్‌ పడవ గోదావరి మధ్యలో మరమ్మతుకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యలమంచిలి మండలం బాడవ, వైవీ లంక గ్రామాలను సందర్శించేందుకు రామానాయుడు వెళ్లారు. పర్యటన ముగించుకుని గోదావరిలో చించినాడకు తిరిగొస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పడవ అకస్మాత్తుగా మొరాయించింది. అసలే గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం.. ఆపై పడవ మరమ్మతుకు గురవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. 

ఇంజన్‌ చెడిపోయిన పడవ నదీ ప్రవాహానికి వెనక్కి వెళ్లిపోతూ తూర్పుగోదావరి జిల్లా దిండి వైపు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే వంతెన ఫిల్లర్లను ఢీకొంది. అక్కడకు సమీపంలో ఉన్న ఓ చెట్టుకు పడవ చోదకుడు తాడు సాయంతో లంగరు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జరిగిన సంఘటనను నరసాపురం డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీలకు మొబైల్‌ఫోన్‌లో సమాచారం అందించగా.. తూర్పుగోదావరి వైపున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలకు సమాచారం అందించారు. యలమంచిలి ఎస్సై గంగాధర్‌ తదితరులు పడవపై వెళ్లి సురక్షితంగా ఎమ్మెల్యే సహా అందులోని వారిని బయటకు తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని