కరోనా చికిత్స ₹10వేలకు మించి కాదు: ఈటల

గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌ని పూర్తిస్థాయిలో కొవిడ్‌ ఆసుపత్రిగా అందుబాటులోకి తెచ్చామని..

Updated : 02 Aug 2020 16:57 IST

టిమ్స్‌ను సందర్శించిన తెలంగాణ మంత్రి

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌ని పూర్తిస్థాయిలో కొవిడ్‌ ఆసుపత్రిగా అందుబాటులోకి తెచ్చామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. టిమ్స్‌ను సందర్శించిన అనంతరం విలేకర్లతో ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్‌ రోగుల కోసం గాంధీ ఆసుపత్రి ప్రత్యేకంగా పని చేస్తోందన్నారు. టిమ్స్‌లో 1,350 బెడ్ల సౌకర్యం ఉందని, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, వెంటిలేటర్లతో కూడిన సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. టిమ్స్‌ ఆసుపత్రిలో అన్ని గదులను కలియతిరిగి పరిశీలించినట్లు చెప్పారు. రోగుల భద్రత, నర్సింగ్‌ సిబ్బంది, ఔషధాలను కూడా సమకూరుస్తామని వెల్లడించారు. లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాలని, కొందరు నాలుగైదు రోజుల ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. అందుకే వైరస్‌ తీవ్రత అధికమవుతోందని, వారిని రక్షించడం కష్టమవుతుందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చి శ్వాస ఇబ్బంది కలిగితే తక్షణమే ఆసుపత్రిలో చేరాలని సూచించారు.

కరోనా చికిత్స ఖరీదైనది కాదని, ఆక్సిజన్‌, మందులన్నీ కలిపితే కూడా రూ.పదివేలకు మించి కాదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. రోజుకు లక్ష, రెండు లక్షలు ఖర్చు అయ్యే చికిత్స అసలు లేదని చెప్పారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి.. అడ్డగోలుగా వసూళ్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో ఐసీయూ, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ నగరంలోని చెస్ట్‌, ఫీవర్‌ ఆసుపత్రి, కింగ్‌ కోఠి ఆసుపత్రిలో కావాల్సినన్ని బెడ్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.  అది ఏర్పాటైతే ఆక్సిజన్‌ సిలిండర్లు దొరికినా దొరక్కపోయినా ఇబ్బంది ఉండదని తెలిపారు. టిమ్స్‌, సరోజిని కంటి ఆసుపత్రి, కింగ్‌ కోఠి, ఫీవర్‌ ఆసుపత్రి, చెస్ట్‌ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రిల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేస్తామని వివరించారు. కరోనా రోగికి మందుల కంటే ఆక్సిజన్‌ ముఖ్యమని, ఈ నెల పదితేదీలోపు లిక్విడ్‌ ఆక్సిజన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts