కరోనా మరణాలపై తప్పుడు గణాంకాలు:హైకోర్టు

కరోనాపై మొక్కుబడి నివేదిక సమర్పించారని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Updated : 12 Oct 2020 19:11 IST

వాస్తవాలు వెల్లడించేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని వ్యాఖ్య

హైదరాబాద్‌: కరోనాపై మొక్కుబడి నివేదిక సమర్పించారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై ఉన్నత న్యాయస్థానం ఈరోజు సుదీర్ఘ విచారణ చేపట్టింది. కరోనాపై వాస్తవాలు వెల్లడించేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కొవిడ్‌ మరణాలపై తప్పుడు గణాంకాలు ఇస్తోందంటూ అసహనం వ్యక్తం చేసింది.

‘‘కరోనా కేసులు తగ్గినా, పెరిగినా మరణాలు పదే ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని కేసులు, మరణాలతో పోలుస్తూ నివేదిక ఇవ్వండి. రాష్ట్రంలో రెండో దశ కరోనా వ్యాప్తి పొంచి ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. కరోనా పరీక్షలు, పడకలు, వెంటిలేటర్లు, మొబైల్‌ వ్యాన్లు పెంచాలి. గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో లైవ్‌ డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి. కమ్యూనిటీ హాళ్లలో కరోనా పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు పరిశీలించాలి. ప్రజారోగ్య సిబ్బందిని ఇతర పథకాల అమలుకు మళ్లించవద్దు. కరోనా పరిస్థితుల్లో గృహ హింసపై ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలి. నవంబర్‌ 16లోపు నివేదిక సమర్పించాలి’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని