తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన...

Updated : 07 Sep 2020 14:26 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.  ప్రణబ్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా దేశానికి ప్రణబ్‌ చేసిన సేవలను కేసీఆర్‌ గుర్తు చేశారు. ఆయన మృతితో ఈ దేశం శిఖర సమానమైన నేతను కోల్పోయిందన్నారు. బంగాల్‌లోని చిన్న గ్రామం నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారని కొనియాడారు. ‘‘ రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత ప్రణబ్‌ ముఖర్జీ. జటిల సమస్యలను పరిష్కరించే నేతగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థిక వేత్తగా పేరుతెచ్చుకున్నారు’’ అని కేసీఆర్‌ సభకు తెలిపారు. అనంతరం విపక్ష పార్టీలకు చెందిన సభ్యులతో పాటు అధికార పార్టీ సభ్యులూ తమ ప్రగాఢసానుభూతి వ్యక్తం చేశారు.

ఎంఐఎం నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత  ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, కాంగ్రెస్‌ నుంచి మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి ప్రణబ్‌ దా మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రణబ్‌ ముఖర్జీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని మిగతా సభ్యులు బలపరిచారు. అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతిపై సభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ తదితరులు రామలింగారెడ్డి సేవలను కొనియాడారు.

మరోవైపు మాజీ రాష్ట్రపతి మరణం పట్ల శాసన మండలి కూడా సంతాపం వ్యక్తం చేసింది. దేశం గొప్ప నేతను కోల్పోయిందంటూ హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ తర్వాత పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రణబ్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. విపక్ష మండలి సభ్యులు ప్రణబ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని