‘ధరణి’ దేశానికే ఆదర్శం: సోమేశ్‌ కుమార్‌

పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో భూలావాదేవీల కోసం విప్లవాత్మకమైన ‘ధరణి’ పోర్టల్ ప్రారంభానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్లు, తహసీల్దార్లకు ప్రభుత్వ

Published : 18 Oct 2020 03:38 IST

హైదరాబాద్‌: పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో భూలావాదేవీల కోసం విప్లవాత్మకమైన ‘ధరణి’ పోర్టల్ ప్రారంభానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్లు, తహసీల్దార్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లతో శనివారం దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా ధరణి సన్నద్ధతపై సమీక్షించారు. పోర్టల్ పనితీరు, లావాదేవీల నిర్వహణకు సంబంధించి సీఎస్ వివరించారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. వినూత్నమైన, విప్లవాత్మకమైన ఈ పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేనివిధంగా ధరణి పనిచేస్తుందని సోమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 

విచక్షణాధికారాలకు ఆస్కారం లేకపోవడంతో సంపూర్ణ పారదర్శకత ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 570 మండలాల్లోని తహసీల్దార్లు సంయుక్త సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తారని చెప్పారు. 142 కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తారని వివరించారు. ధరణి అమలుకు తహసీల్దార్లు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు. ఈ పోర్టల్‌కు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు సమకూర్చాలని, ప్రారంభానికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. ధరణి కోసం పూర్తి స్థాయి హార్డ్‌వేర్ సదుపాయాలు కల్పించాలని, సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా డిస్కం, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు, టీఎస్‌టీఎస్ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులకు సీఎస్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని