Organic Meat: రుచి ఎక్కువ.. విదేశాల్లోనూ మక్కువ

మాంసంలో మాంసకృత్తులే కాదు.. విటమిన్లు, ప్రొటీన్లూ ఎక్కువే. తాజా మాంసంతోనే రుచి ఎక్కువ.

Updated : 30 Aug 2021 12:20 IST

సేంద్రియ మాంసానికి భలే డిమాండ్‌ 
 ధ్రువీకరణ కోసం ఎన్‌ఆర్‌సీఎం దరఖాస్తు 
అధ్యయనానికి రాజస్థాన్‌ వెళ్లిన అధికారులు 

ఈనాడు, హైదరాబాద్‌: మాంసంలో మాంసకృత్తులే కాదు.. విటమిన్లు, ప్రొటీన్లూ ఎక్కువే. తాజా మాంసంతోనే రుచి ఎక్కువ. ఆరోగ్యకరం కూడా. ఇటీవల సేంద్రియ మాంసానికి దేశ, విదేశాల్లో డిమాండ్‌ పెరుగుతోంది. రసాయనాలు వాడని దాణా, గ్రాసం పెట్టి పెంచిన కోళ్లు, గొర్రెలు, మేకల మాంసమే ఇది.  మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దీనికి డిమాండ్‌ పెరుగుతోందని ‘జాతీయ మాంసం పరిశోధన కేంద్రం’ (నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్‌-ఎన్‌ఆర్‌సీఎం) అధ్యయనంలో తేలింది. అయితే.. మాంసానికి ‘సేంద్రియ’ గుర్తింపు ఎవరు, ఏ ప్రాతిపదికన ఇవ్వాలనేదే సమస్యగా మారింది. ప్రస్తుతం పంటలను ఒక పొలంలో వరసగా మూడేళ్లు ఎలాంటి రసాయనాలు వాడకుండా పండిస్తే ‘రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ మండలి’ పత్రాలు జారీ చేస్తోంది. పంటలు సాగు చేయించే కంపెనీలు గాని, రైతులు గాని దరఖాస్తు చేస్తే సాగు సమయంలో తనిఖీలు చేసి, మట్టి నమూనాలను పరీక్షించి పత్రాలను ఇస్తోంది. అదేవిధంగా గొర్రెలు, మేకలు, కోళ్ల ఫారాలనూ తనిఖీ చేసి మాంసానికి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని మండలికి ఎన్‌ఆర్‌సీఎం తాజాగా దరఖాస్తు చేసింది. ఈ పత్రాలుంటే తెలంగాణ, ఏపీ, ఒడిశా,   ఛత్తీస్‌గఢ్‌లలో విక్రయించడమే కాకుండా విదేశాలకూ ఎగుమతి చేయవచ్చు. ఇందుకు మేకలు, గొర్రెలకు వేస్తున్న గ్రాసం సేంద్రియ పైర్ల నుంచే తెచ్చారా, కోళ్లకు వేసే మొక్కజొన్న, సోయా గింజలను సేంద్రియ పద్ధతుల్లోనే పండించారా అనేది పరిశీలించాల్సి ఉంటుంది. ఈ అంశంపై అధ్యయనానికి రాజస్థాన్‌కు అధికారుల బృందాన్ని పంపించినట్లు మండలి సంచాలకుడు డాక్టర్‌ కేశవులు తెలిపారు. 
మండలికే అధికారం

కొందరు వ్యాపారులు సేంద్రియ దాణా పెట్టి గొర్రెలు, మేకలు పెంచుతున్నారు. తాము అమ్మే మాంసానికి సేంద్రియ ధ్రువీకరణ పత్రాల కోసం ఎన్‌ఆర్‌సీఎంకు వస్తున్నారు. కానీ, వాటిని జారీ అధికారం మండలికే ఉంది. గతేడాది (2020-21)లో మన దేశం నుంచి విదేశాలకు 11.22 లక్షల టన్నుల మాంసం ఎగుమతి చేయగా.. రూ. 24,672.39 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీ నుంచి 16,456 టన్నులు, తెలంగాణ నుంచి 2,136 టన్నుల మాంసాన్ని విదేశాలకు గతేడాది ఎగుమతి చేశారని ‘భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల అభివృద్ధి మండలి’(అపెడా) తాజాగా వెల్లడించింది. సేంద్రియ మాంసం ఉంటే ఎగుమతులు మరింత పెరుగుతాయి. -డాక్టర్‌ బస్వారెడ్డి, ఎన్‌ఆర్‌సీఎం శాస్త్రవేత్త

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని