Telangana Tourism: ఆహ్లాదం వైపు అడుగులు.. పుంజుకుంటున్న పర్యాటకం..

కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా రెండోదశ ఉద్ధృతి సమయంలో

Published : 09 Sep 2021 23:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా రెండోదశ ఉద్ధృతి సమయంలో ఇళ్లకే పరిమితమైనవాళ్లు.. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో బయటకొస్తూ, ఆహ్లాదం వైపు అడుగులు వేస్తున్నారు. వర్షాలు బాగా కురవడంతో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. చెరువులు, నదుల్లో జనం బోటు షికార్లతో సందడి చేస్తున్నారు. భయాన్ని వీడి హోటళ్లలో బస చేస్తున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ‘హరిత’ హోటళ్లతోపాటు బోటింగ్‌ ఆదాయం రెండు, మూడు నెలలుగా గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఏప్రిల్, మేలలో రెండోదశ కరోనా, జూన్‌లో లాక్‌డౌన్‌ పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపాయి. మే 12 నుంచి జూన్‌ 19 వరకు పర్యాటక హోటళ్లను, బోటింగ్‌ను నిలిపివేశారు. జులై నుంచి జనం బయటకొస్తుండటంతో రాష్ట్రంలో అన్నిప్రాంతాల్లో పర్యాటకం పెరుగుతోంది. జులై - సెప్టెంబరు వరకు 3 నెలలపాటు 20 శాతం రాయితీ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా ‘హరిత’ హోటళ్లలో గదుల బుకింగ్‌ గణనీయంగా పెరిగేందుకు దోహదపడిందని పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

హుస్సేన్‌సాగర్‌ తర్వాత కోమటిచెరువే..

నాగార్జునసాగర్, హుస్సేన్‌సాగర్, సోమశిల, సింగూరు, పాకాల, కడెం, ఎల్‌ఎండీ కరీంనగర్, కిన్నెరసాని, దుర్గంచెరువు, కోమటిచెరువు, లక్నవరం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 27 చోట్ల బోటింగ్‌ సదుపాయం ఉంది. జూన్‌-ఆగస్టు 3 నెలల్లో 3,29,817 మంది బోటింగ్‌ చేశారు. అత్యధికంగా హుస్సేన్‌సాగర్‌లో 2,07,599 మంది కాగా, ఆ తర్వాత మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకశ్రద్ధతో అభివృద్ధి చేసిన సిద్దిపేట కోమటిచెరువు 66,797 మందితో రెండోస్థానంలో ఉండటం విశేషం. 

మంచిరోజులు వస్తున్నాయ్‌

తెలంగాణలో పర్యాటకానికి మంచిరోజులు వస్తున్నాయి. కొన్ని హోటళ్లలో అయితే కొవిడ్‌కు ముందుకంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. రామప్ప ఆలయానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చే వారి సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరగనుంది. ఆ మేరకు సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం.-శ్రీనివాస్‌గుప్తా, ఛైర్మన్, పర్యాటక అభివృద్ధి సంస్థ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని