TS News: అయిదు నెలల్లో ఖజానాకు రూ.66,324 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అయిదు నెలల్లో రాష్ట్ర వార్షిక అంచనాల్లో 30 శాతం రాబడులు వచ్చాయి. ఆగస్టు చివరి నాటికి పన్నులు, పన్నేతర రాబడి, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్,

Published : 15 Sep 2021 21:01 IST

సగం సొంత రాబడులు 
రుణాల ద్వారా సేకరించింది రూ.22,559 కోట్లు 
కేంద్రం నుంచి అందింది రూ.8,698 కోట్ల్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అయిదు నెలల్లో రాష్ట్ర వార్షిక అంచనాల్లో 30 శాతం రాబడులు వచ్చాయి. ఆగస్టు చివరి నాటికి పన్నులు, పన్నేతర రాబడి, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, రుణాలు సహా మొత్తం రూ.66,324 కోట్లు ఖజానాకు చేరింది. ఈ మొత్తంలో రాష్ట్ర సొంత రాబడులు రూ.33 వేల కోట్లు. మొదటి అయిదు నెలల్లో అత్యధిక ఆదాయం జీఎస్టీ ద్వారా రాగా.. తర్వాత స్థానంలో అమ్మకం పన్ను ఉంది. కేంద్ర పన్నుల వాటా అంచనాల మేరకు ఉండగా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, రాష్ట్ర పన్నేతర రాబడి అంచనాలు గతి తప్పాయి. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంచనాల్లో రాబడి 8 శాతం మాత్రమే ఉండగా పన్నేతర రాబడి 7 శాతంగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెల వరకు రాబడులను రాష్ట్ర ఆర్థికశాఖ విశ్లేషించింది. తెలంగాణకు సొంత పన్నుల రూపంలో రూ.33,744 కోట్లు రాగా పన్నేతర ఆదాయం రూ.2,006 కోట్లు. కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, జీఎస్టీ పరిహారంగా అందిన మొత్తం రూ.8,698 కోట్లు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లో భాగంగా ప్రాయోజిత పథకాలకు కేంద్రం వాటాగా రూ. 2,632 కోట్లు అందగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.913 కోట్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు జీఎస్‌డీపీలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు రూ.47,500 కోట్ల రుణాలను తీసుకునేందుకు అవకాశం ఉండగా.. మొదటి అయిదు నెలల్లో రూ.20,404 కోట్లను అప్పుగా తీసుకుంది. ఇది కాక జీఎస్టీ పరిహారం కోసం కేంద్ర అనుమతించిన మేరకు మరో రూ.2,155 కోట్ల రుణాన్ని సేకరించింది. గత అయిదు నెలల్లో జీఎస్టీ, అమ్మకం పన్ను రాబడులు వరుసగా పెరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు జులైలో అత్యధికంగా రూ.1,211 కోట్లు రాగా మిగిలిన నాలుగు నెలలు వెయ్యికోట్ల కంటే తక్కువ మొత్తం వచ్చింది. రవాణాశాఖ ద్వారా రూ.1,573 కోట్లు పన్ను రూపంలో ఖజానాకు చేరింది. గనుల శాఖ ద్వారా రాబడి రూ.820 కోట్లుగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని