Published : 13 Sep 2021 13:44 IST

Maoists: కలవరపాటులో మావోయిస్టు అగ్రనేతలు..

 జన జీవన స్రవంతిలోకి పెద్దసంఖ్యలో మావోయిస్టులు.. 

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీలో కార్యకర్తలు ఇటీవల పెద్ద ఎత్తున పోలీసులకు లొంగిపోతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గతంలో ఎన్నడూ లేని రీతిలో గత రెండేళ్లుగా ఈ విషయం ఆ పార్టీని ఇబ్బందిపెడుతోంది. ఓవైపు రాష్ట్రం నుంచి రిక్రూట్‌మెంట్లు దాదాపుగా నిలిచిపోగా.. మరోవైపు ఉన్న కొద్దిపాటి కేడర్‌ సైతం లొంగుబాటను ఎంచుకుంటుండటం ఆ పార్టీ అగ్రనేతల్ని కలవరానికి గురిచేస్తోంది. గత ఏడాది వరకు తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో 136 మంది అజ్ఞాతంలో ఉండేవారు. అయితే వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి ప్రాతినిధ్యం మాత్రం తక్కువగానే ఉండేది. వీరిలో 29 మంది మాత్రమే తెలంగాణ కమిటీలో ఉండగా.. మిగిలినవారు కేంద్ర కమిటీతోపాటు ఇతర రాష్ట్ర కమిటీల్లో ఉన్నారు. ఇటీవలి కాలంలో నిర్బంధం పెరగడంతో ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో పార్టీ శ్రేణులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. గత ఏడాది ఆరు నెలల కాలంలోనే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.

రంజిత్‌ బాటలోనే హరిభూషణ్‌ భార్య శారద

కరోనా మహమ్మారి కారణంగా పార్టీలో దిగువశ్రేణి కేడర్‌తోపాటు పలువురు కీలక నేతలు అనారోగ్యానికి గురయ్యారు. ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ కరోనాతో మృతిచెందారు. చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్న ఆయన భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద సైతం కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నారు. ఆమె పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ములుగు జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. మరోవైపు కొద్దిరోజుల క్రితమే మావోయిస్టు రావుల రంజిత్‌ లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి కీలకమైన దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా చెరగని ముద్ర వేసిన రావుల శ్రీనివాస్‌ అలియాస్‌ రామన్నకు రంజిత్‌ తనయుడు. దీనికితోడు కరోనా విజృంభణతోపాటు ఇతర కారణాలు ఆ పార్టీ దిగువశ్రేణులపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. వీరిలో ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం, మలుగు జిల్లాలకు చెందిన మిలీషియా, లోకల్‌ ఏరియా స్క్వాడ్, గ్రామ కమిటీల సభ్యులున్నారు. గతంతో పోల్చితే ఇటీవలి కాలంలో దండకారణ్యంలో కేడర్‌ తరచూ పార్టీని వీడుతున్న ఉదంతాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఏకంగా 50 మంది వరకు కేడర్‌ పార్టీని వీడగా.. ఈసారి ఆగస్టు నాటికే 12 దఫాల్లో 42 మంది జనజీవన స్రవంతిలో కలిశారు. వీరు కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకేసారి 52 మంది సానుభూతిపరులు, కేడర్‌ లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే వారంతా పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకున్న దాఖలాలు లేవని తెలుస్తోంది.   

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని