Justice N.V.Ramana: హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు నా స్వప్నం

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రంతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని

Updated : 20 Aug 2021 14:00 IST

హైదరాబాద్‌ : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రంతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం ట్రస్టు డీడ్‌ రిజిస్ట్రేషన్‌కు సీజేఐ హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు సీజే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మాట్లాడారు.

‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపింది. పెట్టుబడిదారులు వివాదాలు లేని వాతావరణం కోరుకుంటారు. వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలనుకుంటారు.  1926లో తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం మొదలైంది. దుబాయ్‌లోనూ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటైంది. ఆర్బిట్రేషన్‌ కోసం సింగపూర్‌, దుబాయ్‌ వెళ్లాల్సి వస్తుంది. ఆర్బిట్రేషన్‌ కేంద్రం వల్ల కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు వస్తారు. మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం హామీ ఇచ్చారు. ఆర్బిట్రేషన్‌ ఏర్పాటు బాధ్యత జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని కోరుతున్నాను. త్వరగా ఈ కేంద్రం కార్యకలాపాలు జరగాలని ఆకాంక్షిస్తున్నాను’.

‘ఆర్బిట్రేషన్‌ కేంద్రానికి ఒప్పందం తెలంగాణకు చారిత్రక ఘట్టం. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు నా స్వప్నం. దీని కోసం 3 నెలల క్రితం ప్రతిపాదన చేశాను. నా స్వప్నం సాకారానికి 3 నెలల్లోనే అడుగులు పడతాయని ఊహించలేదు. నా ప్రతిపాదనకు సీఎం సత్వరమే స్పందించారు. ఈ కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. నా కల సాకారానికి కృషి చేస్తున్న కేసీఆర్‌, జస్టిస్‌ హిమా కోహ్లీకి కృతజ్ఞతలు’ అని సీజేఐ అన్నారు.

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ.. దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చారని, పీవీ హయాంలోనే ఆర్బిట్రేషన్‌ చట్టం రూపుదిద్దుకుందని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని