Updated : 11 Aug 2020 13:29 IST

భయపెట్టే బంగారు నెలవంక..!

 అఫ్గాన్‌-పాక్‌-ఇరాన్‌ నుంచి భారత్‌కు హెరాయిన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెత ఈ మత్తు మందులకు వర్తించదని తేలిపోయి దశాబ్ధాలు దాటుతున్నా వీటి బారి నుంచి ప్రజలు బయటపడలేకపోతున్నారు. టీబీ మహమ్మారిపై  పనిచేస్తుందనుకొన్న ఓ ఔషధం మత్తుమందుగా మారి ప్రపంచాన్ని మింగేస్తోంది.  తేలిగ్గా కోటానుకోట్లు సంపాదించే   ఈ మార్గం ఉగ్రవాదులు, వేర్పాటు వాదులకు వరంగా మారింది. భారత్‌ సైన్యంలో అత్యంత కీలక పాత్ర పోషించే పంజాబ్‌ రాష్ట్రంలోని యువతను నిర్వీర్యం చేస్తోంది. డబ్బు, ఆయుధాలు, అండర్‌వరల్డ్‌ అండడండలతో ఈ వ్యాపారం భారత్‌లో నిరాటంకంగా కొనసాగుతోంది. తాజాగా నవీ ముంబయిలో 191 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ అక్షరాల రూ. 1,000 కోట్లు..! తీవ్రత చూస్తుంటే భారత్‌లో ఏ స్థాయిలో ఈ మాదకద్రవ్యాల వ్యాపారం వేళ్లూనుకుందో అర్థమవుతోంది.  

హెరాయిన్‌ ఎలా పుట్టింది..?

1850 సమయంలో అమెరికాలో నల్లమందు అలవాటు విపరీతంగా ఉండేది. దీనిని మాన్పించడం కోసం తక్కువ ప్రభావం ఉన్న అనుబంధ ఔషధం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మార్ఫిన్‌ అనే ఔషధాన్ని ఇచ్చారు. ఆ తర్వాత అది నల్లమందును మించి ప్రజలను బానిసలుగా చేసుకొంది. ఈ క్రమంలో 1898లో జర్మనీకి చెందిన ఔషధ సంస్థ బేయర్‌ ఫార్మ క్షయవ్యాధికి ఔషధంగా హెరాయిన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే సమయంలో మార్ఫిన్‌ మత్తు నుంచి బయటపడటానికి కూడా దీనిని వాడారు. అది కూడా మార్ఫిన్‌ను మించి ప్రభావం చూపడం మొదలుపెట్టింది. దీనిని మాన్పించడానికి మెథాడోన్‌ అనే ఔషధం తయారు చేశారు. అది కూడా దుష్ప్రభావం చూపడం మొదలుపెట్టింది. హెరాయిన్‌ వాడేవారికి చనిపోయే అవకాశాలు 20 రెట్లు అధికంగా ఉంటాయని 1990లో నిర్ధారించారు.

భారత్‌కు రెండువైపులా..

ఈ హెరాయిన్‌ మత్తుమందుగా మారాక వీటి అక్రమ వ్యాపారం భారత్‌కు రెండు వైపులా వేళ్లూనుకుంది. ఒక వైపు  అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌-ఇరాన్‌లతో కూడిన బంగారు నెలవంక (అంతర్జాతీయంగా దీనికి ఉన్న పేరు) మరో వైపు బర్మా-లావోస్‌-థాయిల్యాండ్‌తో కూడిన బంగారు త్రికోణం  ఉన్నాయి. తాజాగా ముంబయిలో పట్టుకొన్న రూ.1,000 కోట్ల హెరాయిన్‌  అఫ్గానిస్థాన్ మీదుగా ఇరాన్‌ వచ్చి అక్కడి నుంచి భారత్‌  పోర్టుకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. భూ, జల మార్గాలను ఉపయోగించుకొని స్మగ్లర్లు దీనిని భారత్‌కు చేరుస్తున్నారు. 

ఉగ్రవాదుల స్వర్గధామం కావడంతో..

ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌లలో అంతర్జాతీయ చట్టాలు ఏమాత్రం అమలు కావు. ఈ నేపథ్యంలో ఆ ప్రదేశాల్లో నల్లమందు సాగు చేస్తున్నారు. వాటి ఉత్పత్తి  ప్రాసెస్‌ చేసి హెరాయిన్‌గా మార్చి పాక్‌లోని గ్వాదర్‌, ఇరాన్‌లోని కొన్ని పోర్టుల నుంచి సముద్ర మార్గంలో భారత్‌ వంటి దేశాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లో వీటి కార్యకలాపాలు పెరిగిపోయాయి. 2018లో అంతర్జాతీయ నార్కొటిక్‌ కంట్రోల్‌ బోర్డు నివేదిక ప్రకారం భారత్‌ కూడా మాదకద్రవ్యాల వ్యాపారంలో కీలక హబ్‌గా పేర్కొంది.  భారత్‌లో ఈ మాదకద్రవ్యాల వినియోగదారుల మార్కెట్‌ను ఈ దేశాల స్మగ్లర్లు వశపరుచుకున్నారు.   
ఒక్క అఫ్గానిస్థాన్లోనే 2018లో 2,63,000 హెక్టార్లలో నల్లమందు పంటను సాగుచేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటి నుంచి వచ్చిన ఆదాయం 60 మిలియన్‌ డాలర్లకు పైమాటే. ఇక తాలిబన్ల కనుసన్నల్లో ఈ సాగు జరుగుతోందన్నది అక్షర సత్యం. 

వందల కిలోల్లో సరుకు..

  2019 జులై28న అట్టారి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద 532 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఉప్పు బస్తాల్లో దీనిని దాచిపెట్ట తరలిస్తుంటే గుర్తించారు. భారత కస్టమ్స్‌ డిపార్ట్‌ మెంట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం. పంజాబ్‌, రాజస్థాన్‌, కశ్మీర్‌, గుజరాత్‌లకు పాక్‌కు సరిహద్దు ఉండటంతో వివిధ ప్రాంతాలను ప్రవేశ ద్వారాలుగా చేసుకొని ఈ హెరాయిన్‌ను తరలిస్తున్నారు. ముఖ్యంగా నదులు, సెలయేర్లను స్మగ్లర్లు వాడుకొని గ్రామాల్లోకి  చేరుస్తున్నారు.   దీంతో పాటు పైపులు, తీగలకు కట్టి వీటిని భారత్‌లోకి చేరుస్తారు. అక్కడ ఏజెంట్లు వీటిని  భారత్‌లోని డీలర్లకు చేరుస్తున్నారు. ఈ దశలో భారీగా డబ్బు చేతులు మారుతుంది. పంజాబ్‌ వంటి చోట్ల చేతికి అందిన హెరాయిన్‌కు మరికొన్ని రసాయినాలు జోడించి ‘చిట్టా’ అనే కాక్‌టెయిల్‌ తయారు చేస్తున్నారు. వీటికి యువత బాగా బానిసైపోయింది. గ్రాము రూ.500 చొప్పున విక్రయిస్తున్నారు. పంజాబ్‌లో పోలీసులు కూడా మాదకద్రవ్యాల రవాణ కేసుల్లో అరెస్ట్‌ అయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2014-18మధ్య ఇలా 100 మంది అరెస్ట్‌ అయ్యారు. వీరిలో ఇద్దరు డీఎస్‌పీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. 

2019 మేలో గుజరాత్‌ రాన్‌ ఆఫ్‌ కచ్‌లో ఆరుగురు పాక్ జాతీయులను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేసి 200 ప్యాకెట్ల హెరాయిన్‌ స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికే వారు 100 ప్యాకెట్లను నీటిలో పడేశారు. 

 అది హెరాయిన్‌ హైవే..

ఇక కశ్మీర్‌లో యువతే లక్ష్యంగా వీటిని తరలిస్తున్నారు. 2018 నవంబర్‌ 26న రాజౌరీలో రూ. 40 కోట్లు విలువైన హెరాయిన్‌ స్వాధీనం చేసుకొన్నారు. దీనిపై అఫ్గానిస్థాన్ నుంచి వచ్చినట్లు లేబుల్స్‌ ఉన్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వీటిని తీసుకొచ్చారు.  పంజాబ్‌లో 2018లో పట్టుకొన్న మాదకద్రవ్యాల్లో 80శాతం పాక్‌ నుంచి వచ్చినవే. 

కశ్మీర్‌ను భారత్‌తో కలిపే రామ్‌బన్‌-బనిహాల్‌ జాతీయ రహదారి మాదక ద్రవ్యాల మాఫియాకు రాజమార్గం వంటిది. ఇక్కడ అధికారులను మేనేజ్‌ చేసి పాక్‌ నుంచి వచ్చిన సరుకును దేశాలోకి చేరుస్తున్నారు. కొన్నాళ్లుగా హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా ‘చిట్టా’ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. 2019లో ఇక్కడ 789 మంది అరెస్టు అయ్యారు. 

2017లో జులైలో గుజరాత్‌లోని పోర్‌బందర్‌ తీరం వద్ద ఓ అనుమానస్పద పనమాలో రిజిస్టర్‌ అయిన ఓడను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. దీనిలో దాదాపు 1500 కిలోల హెరాయిన్‌ ఉంది. 8మంది భారతీయులను అరెస్టు చేశారు. 

ముఖ్యంగా రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం.. అధికారులు, రాజకీయ నాయకులు, స్మగ్లర్లు కుమ్మక్కవ్వడంతో మత్తుపదార్థాల వ్యాపారం జోరుగా జరుగుతోంది. భారత్‌-పాక్‌ కౌంటర్‌ నార్కోటిక్  వ్యవస్థ అచేతనంగా ఉండటం కూడా సమస్యను తీవ్రం చేస్తోంది. భవిష్యత్తులో అఫ్గానిస్థాన్లో తాలిబాన్‌ రాజ్యం వస్తే వీటి సాగు విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. 

 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని