అక్కడికి వెళ్లాలంటే.. 8 వేల మెట్లు ఎక్కాల్సిందే..!

సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ ఈ ఆలయానికి వెళితే మాత్రం ప్రశాంతతతోపాటు సంతోషం కూడా రెట్టింపవుతుంది.  కట్టిపడేసే రమణీయ దృశ్యాలు.. చుట్టూ లోయ.. మధ్యలో కొండ.. ఆ కొండపై బుద్ధుని ఆలయం.. చేతికి అందే మేఘాలు… ఇదీ అక్కడి ప్రకృతి సుందరదృశ్యం. అక్కడి రమణీయతను వర్ణించడానికి మాటలు సరిపోవు.

Published : 31 Dec 2020 08:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ ఈ ఆలయానికి వెళితే మాత్రం ప్రశాంతతతోపాటు సంతోషం కూడా రెట్టింపవుతుంది.  కట్టిపడేసే రమణీయ దృశ్యాలు.. చుట్టూ లోయ.. మధ్యలో కొండ.. ఆ కొండపై బుద్ధుని ఆలయం.. చేతికి అందే మేఘాలు… ఇదీ అక్కడి ప్రకృతి సుందరదృశ్యం. అక్కడి రమణీయతను వర్ణించడానికి మాటలు సరిపోవు. ఇంతకీ.. పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోన్న ఆ ప్రదేశం.. ఎక్కడుందో తెలుసా...? చైనాలోని వులింగ్‌ పర్వతశ్రేణిలోని ఫంజింగ్‌షాన్‌ అనే ప్రదేశంలో ఉంది. 

అక్కడ ఒక కొండ మీద ప్రముఖ బౌద్ద ఆలయం ఉంది. కొండపై ఉన్న ఆ బౌద్ధ ఆలయాన్ని సందర్శించడానికి పర్యాటకులు విశేషంగా తరలివస్తుంటారు. ఈ కొండ విశేషం ఏమిటంటే.. కొండ రెండుగా చీలి ఉంటుంది. కొండ దక్షిణ భాగంలో బుద్ధుని ఆలయం ఉంటే, ఉత్తర భాగంలో మైత్రేయ ఆలయం ఉంది. ఈ రెండింటిని కలుపుతూ చిన్న వంతెన ఉంటుంది. ఈ కొండపైకి చేరుకోవాలంటే దాదాపు 8 వేల మెట్లు ఎక్కి తీరాల్సిందే.. మెట్ల గుండా వెళ్తుంటే  ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయి. పైగా హెలికాఫ్టర్‌ ద్వారా కూడా ఈ కొండపైకి చేరుకోవచ్చు. 

క్రీ.శ 7 నుంచి 10వ శతాబ్దాల మధ్య కాలంలో ట్యాంగ్‌ రాజవంశీయులు చైనాను పరిపాలించారు. ఆ సమయంలోనే ఈ ఆలయాలను నిర్మించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా అంత ఎత్తులో ఈ ఆలయాలను ఎలా నిర్మించారనేది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.  మెట్లు ఎక్కేటప్పుడు అప్పటి మింగ్‌, క్వింగ్‌ అనే రాజవంశీయుల పురాతన శాసనాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం వులింగ్‌ పర్వతం దాదాపు 50 బౌద్ద ఆలయాలకు నిలయంగా ఉంది. అందులో మౌంట్‌ ఫంజింగ్‌పై ఉన్న బౌద్ద, మైత్రేయ ఆలయాలు అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వత శ్రేణికి సమీపంలోనే ఫంజింగ్‌షాన్‌ నేషనల్‌ పార్కు ఉంది. ఇది అద్భుతమైన దృశ్యాలకు నిలయం. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు విశేషంగా తరలివస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని