రెండో క్లాసులోనే గిన్నిస్‌ రికార్డు!

ఆరేళ్లకే గిన్నిస్‌ ప్రపంచ రికార్డు ఘనతను సాధించిన అర్హమ్‌ ఓం తల్సానియా

Published : 11 Nov 2020 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ బుడతడు ప్రపంచంలోనే అతి చిన్న వయసు కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. నగరంలోని ఉద్గమ్‌ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న అర్హమ్‌ ఓం తల్సానియా.. ఆరేళ్ల వయసులో ఈ ఘనత సాధించాడు. జనవరి 24, 2013లో పుట్టిన అర్హమ్‌, తన ఏడో జన్మదినానికి ఒక్క రోజు ముందే గిన్నిస్‌ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా ఈ విషయాన్ని సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కూడా ధృవీకరించింది.

అర్హమ్‌ తండ్రి ఓం తల్సానియా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఈ చిన్నారి రెండేళ్ల వయసులోనే టాబ్లెట్‌ను ఉపయోగించటం ప్రారంభించాడు. అనంతరం విండోస్‌, ఐఓఎస్‌లతో పనిచేసే పలు గ్యాడ్జెట్లను వాడటమే కాకుండా వివిధ కంప్యూటర్‌ పజిల్స్‌ను కూడా ఛేదించేవాడట. వీడియో గేమ్స్‌ ఆడుతూ ఉండగా తల్సానియాకు కొత్త వాటిని రూపొందించాలనే ఆలోచన వచ్చిందట. తన కుమారుడి ఆసక్తి గమనించి ప్రోగ్రామింగ్‌లో ప్రాథమిక శిక్షణ ఇచ్చినట్టు అర్హమ్‌ తండ్రి వివరించారు. నేర్చుకోవటమే కాకుండా ఈ గడుగ్గాయి పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో చిన్ని చిన్న గేమ్స్‌ కూడా స్వయంగా తయారుచేసేవాడు. అందుకు రుజువుగా తను చేసిన ఏదైనా వర్క్‌ను పంపమని మైక్రోసాఫ్ట్‌ అడిగిందని.. అవి పంపిన వెంటనే తనకు సర్టిఫికెట్‌ వచ్చిందని చెప్పాడీ బుడతడు.

యాప్స్‌, గేమ్‌లు, కోడింగ్‌ అంటే చాలా ఇష్టమంటున్న ఈ చిన్నారికి.. వ్యాపారవేత్తగా రాణిస్తూ అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలనేది ఆశయమట. పిట్ట కొంచెం కూత ఘనమనే విధంగా ఆరేళ్లకే గిన్నిస్‌ ఘనతను సాధించిన అర్హమ్‌ ఓం తల్సానియాకు నెటిజన్లతో పాటు మైక్రోసాఫ్ట్‌ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని