‘భారత్‌’ వ్యాక్సిన్లు ఏ దశలో ఉన్నాయి‌?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ అంతానికి వ్యాక్సిన్‌ కనిపెట్టడంలో భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఔషధ తయారీ కంపెనీలు జోరుగా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ వ్యాక్సిన్లు ఏ దశలో.........

Published : 16 Sep 2020 01:13 IST

ఐసీఎంఆర్‌ డీజీ ఏమన్నారంటే..

దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ అంతానికి వ్యాక్సిన్‌ కనిపెట్టడంలో భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఔషధ తయారీ కంపెనీలు జోరుగా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ వ్యాక్సిన్లు ఏ దశలో ఉన్నాయనే విషయాన్ని ఐసీఎంఆర్‌ మంగళవారం వెల్లడించింది. భారత్‌లో మూడు కంపెనీలకు చెందిన కరోనా టీకాలు క్లినికల్ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ తెలిపారు. క్యాడిలా, భారత్‌ బయోటెక్‌ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు తొలి దశ పూర్తి చేసుకొని.. రెండో దశ కోసం వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశాయని తెలిపారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా మూడో దశకు అనుమతులు రాగానే 14 చోట్ల క్లినికల్ ట్రయల్స్‌కు ప్రారంభమవుతాయన్నారు.

క్యాడిలా టీకా తొలి దశ ట్రయల్స్‌ పూర్తి చేసుకుందని.. రెండో దశ వాలంటీర్ల ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఈ టీకాను 28 రోజులకు ఒకసారి మూడు డోసుల్లో ఇస్తారని చెప్పారు. అలాగే, భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాగా.. ఆ ఫలితాలను విశ్లేషిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రెండో దశ కోసం వాలంటీర్ల ప్రక్రియ పూర్తయిందన్న ఆయన.. వారికి రెండో డోసు అందించాల్సి ఉందని చెప్పారు. మరోవైపు, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఫేస్‌2-బి ట్రయల్‌ పూర్తయిందని.. ఏడెనిమిది రోజుల విరామం ఉంటుందన్నారు. ఆ సంస్థ మూడో దశ ట్రయల్స్‌ను ప్రారంభించాలనుకుంటోందని చెప్పారు. అనుమతులు రాగానే దేశంలో 14 ప్రాంతాల్లో 1500 మందికి డోసులు ఇవ్వనున్నారని బలరాం భార్గవ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని