ప్లాస్టిక్‌ సంచులకు చరమగీతం పాడాలని....

మీకు తెలుసా...సాధారణంగా మనం ఉపయోగించే పాలిథీన్‌ సంచి మట్టిలో కలిసేందుకు 500 ఏళ్లకుపైగా సమయం పడుతుందని. ఇప్పటికే ఎన్నో సమస్యలను సృష్టిస్తున్న పాలిథీన్‌ ..భావితరాల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తుందనటంలో సందేహం లేదు

Published : 21 Nov 2020 02:01 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : మీకు తెలుసా...సాధారణంగా మనం ఉపయోగించే పాలిథీన్‌ సంచి మట్టిలో కలిసేందుకు 500 ఏళ్లకుపైగా సమయం పడుతుందని. ఇప్పటికే ఎన్నో సమస్యలను సృష్టిస్తున్న పాలిథీన్‌ ..భావితరాల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తుందనటంలో సందేహం లేదు. చాలామందికి ఈ విషయంపై అవగాహన ఉన్నా పట్టించుకోవటం లేదు. వట్టిచేతులతో బయటకు వెళ్లిన ప్రతీసారి రోజుకు కనీసం ఒక ప్లాస్టిక్‌ కవర్‌తో ఇంటికి వెళ్తున్నారు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టడం ఎలా? ఆ ప్రశ్నే ఆ యువకులతో సరికొత్త ప్రయత్నం చేయిస్తోంది. పాలిథీన్‌ సంచుల కంటే తక్కువ ధరకు లేదా ఉచితంగా.. కాగితపు సంచులను సరఫరా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను అమల్లో పెట్టేందుకు కారణమయ్యింది. ప్లాస్టిక్‌రహిత హైదరాబాదే లక్ష్యంగా ముందుకు సాగుతూ.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ యువత ఆలోచనపై మీరూ లుక్కేయండి.

రీకవర్‌ సంస్థ ఏర్పాటు...
కూకట్‌పల్లికి చెందిన హరీశ్‌, కిరణ్‌ కుమార్‌, మహేశ్‌లకు సమాజహిత కార్యక్రమాలు చేయటమంటే ఎంతో ఆసక్తి. హైదరాబాద్‌లో పాలిథీన్‌ కవర్ల వినియోగం లేకుండా చేయాలన్న లక్ష్యంతో వీరు పనిచేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్‌ నిజాంపేటలోని ఓ ప్రైవేటు స్థలాన్ని లీజుకు తీసుకుని ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. రీకవర్‌ పేరిట సంస్థను ప్రారంభించారు. రీసైకిల్డ్‌ ఫుడ్‌ గ్రేడ్‌ కాగితాలతో వివిధ రకాల పరిమాణంలో కాగితపు సంచులు తయారు చేయటం మొదలు పెట్టారు. ప్రజలెవరూ పాలిథీన్‌ సంచులు వినియోగించకుండా ఉండాలంటే ఉచితంగా కాగితపు బ్యాగులు పంచాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వాణిజ్య ప్రకటనలను ఆయుధంగా మలచుకున్నారు. వాటిని కాగితపు సంచులపై ముద్రిస్తున్నారు. దీంతో కంపెనీలకు ప్రచారం కల్పించటంతో పాటు వినియోగదారులకు కాగితపు సంచులను ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. వీటి సరఫరా కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగిస్తున్నారు. 

ప్లాస్టిక్‌ వల్ల దుష్పరిణామాలెన్నో...
ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. మనిషికీ మట్టికి మధ్య అడ్డుగోడలా మారి పెనుసవాల్‌గా నిలుస్తున్నాయివి. జంతువులు వీటిని తినటం దగ్గర నుంచి  డ్రైనేజీ వ్యవస్థకు ఇవి అడ్డంకిగా మారటం, పర్యావరణానికి హాని కలిగించటం వంటి వాటి వరకు కలిగే దుష్పరిణామాలకు లెక్కేలేదు. అందువల్ల ఒకసారి వాడి పడేసే పాలిథీన్‌ సంచుల వాడకాన్నీ మానేయాల్సిన అవసరం  ఎంతైనా ఉందంటున్నారు ఈ మిత్రులు. వాటికి బదులుగా పేపర్‌, క్లాత్‌, జూట్‌ తదితరాలతో తయరయ్యే బ్యాగులను ఉపయోగించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నారు. 

‘‘ పేపర్‌ బ్యాగ్‌ కనీసం 1 రూపాయి నుంచి 2 అంతకంటే ఎక్కువ ధరకు లభిస్తుంది. ఆ ధరను తగ్గించాలంటే ప్రకటనలు తప్పనిసరి. ప్రకటనల వల్ల ఉచితంగా కూడా బ్యాగులను అందించవచ్చు. అంతేకాకుండా మా బ్రాండింగ్‌ కూడా ప్రతీఒక్కరి దగ్గరకూ వెళ్తుంది. మాకు తెలిసినంత వరకు ఇంతకంటే తక్కువ ధరలో ప్రకటనలు చేసుకునే అవకాశం ఎక్కడా ఉండదు. మా సంచులలో పండ్లు వంటి పదార్థాలు నిల్వ ఉంచినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ బ్యాగులను వినియోగించిన తరువాత రీసైక్లింగ్‌కూ పంపవచ్చు’’ అని ఈ మిత్రులు అంటున్నారు. 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని