పరుగెడుతూ అంబులెన్స్‌కు దారి..వీడియో వైరల్

నగరంలోని వివిధ కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ ఏమేరకు గంటల తరబడి నిలిచిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరగంటలో ఇంటికి వెళ్లాల్సిన వారు గంటల...

Updated : 04 Nov 2020 19:43 IST

హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని వివిధ కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ ఏమేరకు గంటల తరబడి నిలిచిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరగంటలో ఇంటికి వెళ్లాల్సిన వారు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడడం భాగ్యనగరంలో సర్వసాధారణం. అలా ట్రాఫిక్‌లో ఇరుక్కుని సకాలంలో ఆస్పత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్‌ను సకాలంలో ఆస్పత్రికి వెళ్లేలా చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో బాబ్జీ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉంటే మొజంజాహీ మార్కెట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో కోఠి వెళ్లే మార్గంలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడాన్ని గమనించారు. అంబులెన్స్‌ వెళ్లేందుకు ఎలాగైనా ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాలని భావించారు. దీంతో ఆయనే ముందు పరుగెడుతూ.. వెనుక అంబులెన్స్‌ ఉన్న విషయాన్ని వాహనదారులకు సూచిస్తూ ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. దీంతో సకాలంలో ఆ అంబులెన్స్‌ ఆస్పత్రికి చేరుకోవడంతో అందులోని వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని