Updated : 19 Aug 2020 10:59 IST

ఆ ఖజానా ఎవరిది?

● భారీగా బంగారం, వెండి స్వాధీనం

అనంత నేరవార్తలు: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో భారీగా బంగారు, వెండి నగలు వెలుగుచూసిన ఘటన కలకలం రేపింది. ఎనిమిది పెట్టెల్లో నిల్వ ఉంచిన ఆభరణాలను పోలీసులు గుర్తించారు. ఇంత పెద్దమొత్తంలో ఒక్కసారి బయటపడటంతో జిల్లాలో కలకలం రేగింది. ఆ సొమ్ము ఎవరిది? ఎక్కడ్నుంచి తెచ్చారు అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇనుప పెట్టెల్లో భద్రపరచి చిన్న షెడ్డులో ఎందుకు ఉంచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఖజానా ఎవరిది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు డీఎస్పీలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఎనిమిది పెట్టెలు తెరిచి చూడగా.. 2.4కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55లక్షల నగదు, 27లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.49లక్షల బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ పత్రాలు గుర్తించారు. 6 బైక్‌లు, 3 రాయల్‌ ఇన్‌ఫీల్డ్ బుల్లెట్లు, అత్యంత ఖరీదైన మరో ద్విచక్రవాహనం, ట్రాక్టర్లు, 2 అత్యాధునిక కార్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మూడు 9ఎంఎం తుపాకులు, ఒక ఎయిర్‌గన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మంతా ఖజానా శాఖ ఉద్యోగి మనోజ్‌కి చెందినవిగా అనుమానిస్తున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లు ఆ ఉద్యోగి బంధువుల పేర్ల మీద ఉన్నట్లు సమాచారం.

ఖజానా శాఖలో ఆయన మాటే వేదం

విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఆ ఉద్యోగి సుమారు 15 ఏళ్ల కిందట ఖజానా శాఖలో ఉద్యోగిగా చేరాడు. ఆ శాఖలో ఎవరికి ఏ సెక్షన్లో పని ఉన్నా ఆ ఉద్యోగినే సంప్రదిస్తారు. ఆయన సొమ్ము ఇవ్వనిదే ఏ పనీ చేయడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడ ఆయన మాట నెగ్గాల్సిందే. లేదంటే బెదిరింపులకు వెనుకాడడు. రూ.లక్షలు ఇచ్చినా.. ఇంకా పని చేయకుండా కాలయాపన చేస్తున్నారని కొందరు బాధితులు వాపోయారు. పలు మార్గాల్లో అక్రమంగా సంపాదించాడు. విలాసవంతంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు నాలుగు కార్లు, నాలుగు బుల్లెట్‌ వాహనాలు, రెండు గుర్రాలు ఉన్నాయంటే.. ఆయన సంపాదన ఏమిటో అర్థమవుతోంది. ఇటీవల రూ.15 లక్షలు ఖరీదైన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఇంకా అనేక ఆస్తులు బినామీల పేర్లతో ఉన్నాయి. అశోక్‌నగర్‌లో సెంట్రల్‌ ఏసీతో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. బుక్కరాయసముద్రానికి వెళ్లే దారిలో చెరువుకట్ట వద్ద మరో నివాసం ఉన్నట్లు సమాచారం. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి కార్యాలయానికి విధులకు వస్తుంటాడు. ఆయన వెంట నిత్యం నలుగురు యువకులు అంగరక్షకుల్లా ఉంటారు. వారికి మంచి వేతనంతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనం సమకూరుస్తున్నాడు. మొత్తంగా 10 మంది యువకులకు వేతనాలు చెల్లిస్తూ.. వివిధ పనులు అప్పగిస్తున్నట్లు తెలిసింది.

రియల్‌ దందా చేశాడా?

ఖజానా ఉద్యోగి తన వద్ద ఎయిర్‌ పిస్టల్‌ను ఉంచుకోవడంతో రియల్‌ దందాలు చేశాడా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పిస్టల్‌ పట్టుకుని తగాదా ఉన్న భూములు కొనుగోలు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆయన పేరుతో నగరంలో చాలాచోట్ల ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అక్రమార్జనపై పోలీసులు సమగ్రంగా విచారిస్తే అన్ని విషయాలు వెలుగు చూస్తాయి. మరోవైపు రాజకీయ అండ కూడా ఉన్నట్లు సమాచారం. అధికారులపై ఒత్తిళ్లు చేయించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తుపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని