ఏపీ సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను

Updated : 26 Aug 2020 19:15 IST

దిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. మూడు రాజధానుల వ్యవహారంపై గురువారం (రేపే) హైకోర్టులో విచారణ ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించేలా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా... ఫలాన గడువులోపు విచారణ ముగించాలని తాము ఆదేశించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈకేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం వాదనలపై న్యాయవాది నారీమన్‌ అభిప్రాయాన్ని ధర్మాసనం ప్రత్యేకంగా తీసుకుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పడిందని, రాష్ట్రపతి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని నారీమన్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులపై అసెంబ్లీలో చట్టం చేయరాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేశామని ఎలా చెబుతుందని నారీమన్‌ ప్రశ్నించారు. నారీమన్‌ అభిప్రాయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజధాని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు శ్యాందివాస్‌, నీరజ్‌కిషన్‌పాల్‌ వాదనలు వినిపించారు. 

ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం ముందుకు ఆ తర్వాత జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌ ధర్మాసనం ముందుకు మూడు రాజధానుల పిటిషన్ విచారణకు వచ్చినా... సాంకేతిక కారణాలతో మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో ఇవాళ జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ధర్మాసనం ముందుకు పిటిషన్‌ విచారణకు వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని