Published : 20 Nov 2020 01:47 IST

తుంగభద్రకు పుష్కరాల శోభ

రేపే ప్రారంభం
12రోజుల పాటు నిర్వహణకు ఏర్పాట్లు


 

ఇంటర్నెట్‌ డెస్క్‌: తుంగభద్ర నదికి పుష్కర శోభ వచ్చింది. 12రోజుల పండుగకు నదీమ తల్లి ముస్తాబైంది. అధికార యంత్రాంగం పుష్కరాల కోసం ఘాట్లు ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమైంది. రహదారులు, ఇతరత్రా మౌలిక వసతుల ఏర్పాటు ముమ్మరంగా సాగుతోంది. సాధారణంగా పుష్కరాలంటే నదీ స్నానాల సందడి ఉంటుంది. ఈసారి కరోనా కారణంగా పుణ్యస్నానాలకు అంతరాయం ఏర్పడనుంది. లక్షలాది మంది గుమికూడే ప్రమాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నదీ స్నానాలు నిషేధించింది. పూజాది కార్యక్రమాలు, పిండ ప్రదానాలు చేసేందుకు మాత్రం అనుమతించింది. 

2008లో 50లక్షల మంది

గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగుతాయని, తుంగభద్ర నదీ జలాలు తాకితే సర్వ రోగాలు మాయమవుతాయని పెద్దలు చెబుతారు. అందుకే ‘గంగా స్నానం.. తుంగా పానం’ అన్న నానుడి వచ్చింది. ఎంతో ఘన చరిత్ర సొంతం చేసుకున్న తుంగభద్ర నదికి ఈ నెల 20 నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు 12రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి.  12 ఏళ్లకు ఓసారి వచ్చే పుష్కరాలకు తుంగభద్ర నది ముస్తాబైంది. 2008లో తుంగభద్ర పుష్కరాలు జరగ్గా సుమారు 50లక్షల మంది భక్తులు కర్నూలు జిల్లాలోని పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించారు.

రామాయణ కాలం నుంచే! 

తుంగభద్ర నది కృష్ణా నదికి ప్రధానమైన ఉపనది. రామాయణ కాలంలో ఈ నదిని పంపా నదిగా పిలిచారని చెబుతుంటారు. తుంగ, భద్ర అనే రెండు నదుల కలయికే తుంగభద్ర నది. కర్ణాటక రాష్ట్రంలోని పడమర కనుమల్లో వరాహ పర్వత శ్రేణుల్లో గంగమూల అనే ప్రదేశంలో తుంగ, భద్ర అనే నదులు ఆవిర్భవించాయి. వేర్వేరుగా ప్రవహిస్తూ సుమారు 147 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. కూడ్లీ అనే పట్టణం వద్ద రెండు నదులు కలిసి తుంగభద్రగా అవతరించాయి. అక్కడి నుంచి శృంగేరి పీఠం, హంపీ మీదుగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం మేళిగనూరు వద్ద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రామాపురం, మంత్రాలయం, నాగలదిన్నె, గురజాల, అలంపూర్‌, కర్నూలు నగరం మీదుగా ప్రయాణించి సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో మమేకమవుతుంది. ఈ నది ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ సరిహద్దు గుండా ప్రవహిస్తోంది. 

నదీ తీరంలో వివిధ పుణ్యక్షేత్రాలు

తుంగభద్ర నది అతి ప్రాచీనమైన మహానదిగా పెద్దలు చెబుతారు. రామాయణ కాలం కంటే ముందుగానే నది ఉండేదని చెప్పడానికి ఆధారాలున్నాయి. తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో అనేక ఔషధ లక్షణాలు కలిగిన వృక్షాలు ఉన్నాయని వీటి మీదుగా ప్రవహించిన నీటికి ఔషధ లక్షణాలు ఉన్నాయని చెబుతారు. ఉత్తరాదిన గంగా స్నానం ఎంత పవిత్రమైందో దక్షిణాన తుంగ అంత పవిత్రమైంది. తుంగభద్ర తీరంలోనే శృంగేరి,  హంపి, మంత్రాలయం, అలంపురం తదితర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. హంపి కేంద్రంగా విజయనగర సామ్రాజ్యం విరాజిల్లింది. 

12 నదులకు పుష్కరాలు

దేశంలోనే 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు జరుగుతాయి. వాటిలో తుంగభద్ర నది ఒకటి. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఆ ప్రకారం ఒక్కో ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు జరుగుతాయి. మొదటి 12రోజులు ఆది పుష్కరాలు గాను, సంవత్సరంలోని చివరి 12రోజులను అంత్య పుష్కరాలుగా పిలుస్తారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 1.21 గంటలకు బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించాక తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతాయి. డిసెంబర్‌ 1 వరకు ఆది పుష్కరాలు జరుగుతాయి. గతంలో 2008 డిసెంబర్‌ నెలలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సహా కర్ణాటకలో తుంగభద్ర పుష్కరాలు నిర్వహించారు. కర్నూలు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని కర్నూలు, మంత్రాలయం, అలంపూర్‌లలో పుష్కరాలు ఘనంగా నిర్వహించారు. అప్పట్లో లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. 

పూజాది కార్యక్రమాలకు అనుమతి

ప్రస్తుతం తుంగభద్ర పుష్కరాలకు కరోనా అడ్డంకిలా మారింది. వేలాది మంది గుమికూడే అవకాశం ఉండటం, నదిలో బృందాలుగా స్నానాలు ఆచరించడం వల్ల కరోనా వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా నదీ స్నానాలను ప్రభుత్వం నిషేధించింది. కేవలం పిండ ప్రదానాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చింది. అయినా భక్తులు గుమికూడే ప్రమాదం ఉన్నందున ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ రూపొందించినట్లు మొదట ప్రకటించారు. వైబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి వారిని మాత్రమే ఘాట్‌లలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడం వల్ల వెబ్‌సైట్లో స్లాట్ల బుకింగ్‌ను నిలిపేశారు. 

పురోహితులకూ కరోనా పరీక్షలు

తుంగభద్ర పుష్కరాల్లో పిండ ప్రధానాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించే పురోహితులు సైతం కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పుష్కరాల్లో పాల్గొనే పండితులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ వస్తేనే వారిని అనుమతిస్తారు. ఒక్కో పుష్కర ఘాట్‌లో 15 మంది పురోహితులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. జిల్లాలో 23 పుష్కర ఘాట్‌లు ఉండగా ఒక్కో ఘాట్‌లో 15 మంది చొప్పున 345 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. గత తుంగభద్ర పుష్కరాల్లో ఒక్కో ఘాట్‌కు 20 మంది పురోహితులను అనుమతించారు. ఈ ఏడాది కరోనా కారణంగా పరిమితంగానే పురోహితులను అనుమతిస్తున్నారు. సంకల్‌ బాగ్‌ పుష్కర్‌ ఘాట్‌ వద్ద హోమం నిర్వహించేందుకు మరో 20 మంది పండితులను ఆహ్వానిస్తున్నారు. 

అభివృద్ధి పనులకు రూ.230కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మాత్రమే ప్రవహించే తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహించేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు. ఘాట్‌లకు రహదారులు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతులు తదితరాల కోసం సుమారు రూ.230కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో 23 ఘాట్లను అందుబాటులోకి తెచ్చారు. కరోనా కట్టడికి నదీ స్నానాలు నిషేధించామని ప్రభుత్వం చెబుతున్నా ఈ నిర్ణయంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలి. ఘాట్‌లోకి ప్రవేశించక ముందే శరీర ఉష్ణోగ్రతలు పరిశీలిస్తారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. 12 ఏళ్లలోపు చిన్నారులు, 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఇతర జబ్బులతో బాధపడేవారికి అనుమతి లేదు. వచ్చే భక్తులు క్రమశిక్షణతో భౌతిక దూరం పాటిస్తూ పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. భక్తులు ఒక అడుగు లోతు మాత్రమే నదిలోకి దిగి నీటిని నెత్తిన చల్లుకుని వెళ్లే అవకాశం కల్పిస్తారు. నది లోపలికి దిగకుండా జాలీలు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని