‘ఐపీసీ, సీఆర్పీసీ మార్పుపై ప్రధాని యోచన’

దేశంలోని అన్ని నగరాల్లో జనాభా పెరుగుతోందని.. ఎంతో మంది ఉపాధి, ఉద్యోగాల కారణంగా వలసలు వస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 04 Oct 2020 16:14 IST

వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: దేశంలోని అన్ని నగరాల్లో జనాభా పెరుగుతోందని.. ఎంతో మంది ఉపాధి, ఉద్యోగాల కారణంగా వలసలు వస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నగరాల్లో పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు మంచి పోలీసు వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ అంబర్‌పేట డీసీపీ కార్యాలయంలో సీసీ టీవీ కెమెరాలను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల పోలీసులు బాగా పనిచేస్తున్నట్లు పలువురు ప్రశంసిస్తున్నారని చెప్పారు. గతంలో నేరాలను రుజువు చేయడం చాలా కష్టమయ్యేదని.. ప్రస్తుతమున్న సాంకేతికత ద్వారా నిందితులకు శిక్షలు అమలు చేయడంతో తెలంగాణ ముందుందని చెప్పారు. 

సేఫ్‌ సిటీ ప్రాజెక్టు కింద దేశంలోని 8 ప్రధాన నగరాలు హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయిలో పోలీసు వ్యవస్థ ఆధునీకరణపై కేంద్రం దృష్టి పెట్టినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. ఫొరెన్సిక్‌ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బ్రిటీష్‌కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను మార్చేందుకు ప్రధాని మోదీ యోచిస్తున్నారని చెప్పారు. దీనిపై పలువురు అధికారుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని.. ప్రజల నుంచీ అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన వివరించారు. 

చీకట్లో గుర్తించే సాంకేతికత మనదగ్గర ఉంది: సీపీ అంజనీకుమార్‌

2014 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌ పోలీసు వ్యవస్థ అన్ని రంగాల్లో ముందుందని నగర పోలీసు కమిషనర్‌ (సీపీ) అంజనీకుమార్‌ చెప్పారు. ముఖ్యమైన కేసుల విచారణలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సహకరించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీపీ ధన్యవాదాలు తెలిపారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ క్లియరెన్స్‌తో పాటు అన్ని విషయాల్లో ప్రజల నుంచి సహకారం అందుతోందని చెప్పారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సోషల్‌ మీడియా ద్వారా 30-40శాతం ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రతి కేసులోనూ ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోందని.. చీకట్లో సైతం గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం హైదరాబాద్‌ పోలీసుల వద్ద ఉందని అంజనీకుమార్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని