హైదరాబాద్‌లో వాహన విస్ఫోటం!

హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య జనాభాతో పోటీపడి పెరుగుతోంది. రోజుకు వందల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. పెరుగుతున్న వాహన విస్ఫోటనం గ్రిడ్‌లాక్‌ దిశగా పరుగులు తీస్తోంది. కరోనా ప్రభావంతో కొత్త వాహనాల కొనుగోళ్లు తగ్గుతాయని భావించినా..

Updated : 24 Nov 2022 14:18 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య జనాభాతో పోటీపడి పెరుగుతోంది. రోజుకు వందల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. పెరుగుతున్న వాహన విస్ఫోటం గ్రిడ్‌లాక్‌ దిశగా పరుగులు తీస్తోంది. కరోనా ప్రభావంతో కొత్త వాహనాల కొనుగోళ్లు తగ్గుతాయని భావించినా.. అందుకు భిన్నంగా రెండున్నర లక్షలకు పైగా నూతన వాహనాలు రోడ్డెక్కాయి.

కొవిడ్‌ ప్రభావం ఉంటుందని భావించినా...
ఉరుకులు, పరుగుల జీవనంలో వాహనాల పాత్ర అంతా ఇంతా కాదు. అందుకే వాటి డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా... హైదరాబాద్‌లో మాత్రం వాహనాల సంఖ్యలో పెరుగుదల జోరుగా ఉంది. ఖరీదైన కార్లతో పాటు ద్విచక్ర వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు కొత్తగా 800 వందల వరకు వాహనాలు రోడ్డుమీదకు వస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో పెరుగుతున్న వాహనాల కొనుగోళ్లపై అంచనా వేసిన అధికారులు.. వాటిపై కొవిడ్‌ ప్రభావం ఉంటుందని భావించారు. కానీ అందుకు భిన్నంగా నగర వాసులు రికార్డు స్థాయిలో వాహనాలను కొనుగోలు చేశారు. 

కొవిడ్ నిబంధనల వల్ల ప్రజా రవాణాతో పాటు ఇతర వాహనాలు అందుబాటులో లేకపోవటంతో ప్రజలు సొంత వాహనాల మీద ఆసక్తి కనబరిచారు. కరోనా దృష్ట్యా భౌతిక దూరానికీ అలవాటు పడిన ప్రజానీకం గుంపులుగా ప్రయాణాలు చేసేందుకు ఇష్ట పడటం లేదు. సొంత వాహనాలు కొంటున్నారు. వాహనాలకు రుణ సౌకర్యం లభించటం ఇందుకు బాగా కలిసి వస్తోంది. ఒకేసారి మొత్తం సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకపోవటంతో కొంత డబ్బు డౌన్‌ పేమెంట్‌ కింద కట్టి వాహనాలు తెచ్చుకుంటున్నారు. మిగతా సొమ్మును వాయిదాల్లో చెల్లిస్తున్నారు.

ద్విచక్ర వాహనాలే ఎక్కువ...
ద్విచక్ర వాహనాలు అనుహ్యంగా పెరుగుతుండటంతో పాటు ఖరీదైన వాహనాల సంఖ్య కూడా ఎక్కువవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది జూన్‌, జూలై, ఆగస్టు సమయంలో హైదరాబాద్‌లో 20 వేలకు పైగా వాహనాల కొనుగోలు చేశారు. దసరా సందర్భంగా రాయితీలు ప్రకటించటంతో సెప్టెంబరులో 36 వేలు, అక్టోబరులో 25వేల కొత్త వాహనాల కొనుగోలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబరు నెలాఖరుకు నగరంలో 2,67,400 వాహనాల రిజిస్ర్టేషన్‌ జరగగా, ఇందులో 1,94,311 ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. మొత్తం వాహనాల్లో వాటి వాటా 73 శాతంగా ఉంది. వీటితో పాటు మరో 54 వేల కార్లు కొత్తగా రోడ్డు మీదకు వచ్చాయి. 

రోజు రోజుకూ వస్తున్న కొత్త వాహనాలతో హైదరాబాద్‌ చక్రబంధంలో చిక్కుకుంటోంది. కరోనా వల్ల పలు రంగాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ నగర రోడ్లపై ఇప్పటికే పద్మవ్యుహాన్ని తలపిస్తోంది ట్రాఫిక్‌. ఐటీతో పాటు వినోదం, ఆతిథ్య రంగాల కార్యకలాపాలు ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. ఇవన్నీ పూర్తిగా ప్రారంభమైతే ట్రాఫిక్‌లో కాలుకదపని పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇదీ చదవండి.. 

నగరం సల్లబడ్డది..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని