
డ్రైవర్ లేడు.. కారెవరు నడుపుతున్నారబ్బా!?
ఇంటర్నెట్ డెస్క్: డ్రైవర్ సీట్లో ఎవరూ లేకుండానే ఓ కారు రహదారిపై దూసుకుపోతున్నట్లు ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. డ్రైవర్ పక్క సీట్లో ఓ వ్యక్తి దర్జాగా కూర్చొని ఉండగా.. డ్రైవర్‌లేని ఆ పాత కారు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతుండటం నెటిజన్లను సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.
తమిళనాడులోని రహదారిపై దర్శనమిచ్చిన ఓ పాత ఫియట్ కారు డ్రైవర్ లేకుండానే పరుగులు పెడుతోంది. కారులో ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఆయన డ్రైవర్ పక్కసీటులో కూర్చొని ఉండగా ఆ కారు రహదారిపై ఇతర వాహనాలను దాటుకుంటూ పరుగులు పెడుతూ కనిపించింది. వెనకాలే వెళుతున్న మరో కారు డ్రైవర్ ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. ఇది ఎలా సాధ్యమంటూ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎలా సాధ్యమంటూ కామెంట్లు పెడుతున్నారు. డ్రైవింగ్ స్కూల్ వాహనానికి ఉన్నట్లు రెండు వైపులా పెడల్ వ్యవస్థ ఉందేమోనని కొందరు అనుమానం వ్యక్తంచేశారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తన వద్ద ఉన్న పెడల్ వ్యవస్థని అదుపు చేస్తూ కుడిచేత్తో చాకచక్యంగా స్టీరింగ్ తిప్పుతున్నాడేమో అని పేర్కొన్నారు. అయితే, కొందరు నెటిజన్లు దీనిపై క్లారిటీ ఇచ్చారు. అతడు తమిళనాడులోని వెల్లూరు ప్రాంత వాసిగా పేర్కొన్నారు. ప్యాసింజర్ సీట్లో కూర్చొని అతడు డ్రైవింగ్ చేయడాన్ని తాము పలుమార్లు చూశామని చెప్పుకొచ్చారు. ఆ వీడియో మీరూ చూసేయండి..