వివేకా హత్యకేసు..విచారణకు తాత్కాలిక బ్రేక్‌!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దర్యాప్తు చేస్తున్న 15

Published : 06 Oct 2020 15:09 IST

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దర్యాప్తు చేస్తున్న 15 మంది అధికారుల్లో ఇప్పటికే నలుగురికి వైరస్‌ సోకగా.. తాజాగా మరో ముగ్గురు కొవిడ్‌ బారిన పడ్డారు. అధికారులకు కరోనా సోకడంతో ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. సుమారు నెల రోజులపాటు విచారణకు విరామం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

వివేకా హత్య కేసులో రెండో విడత దర్యాప్తు కోసం గత నెల సుమారు 15 మంది సీబీఐ అధికారులు కడప జిల్లాకు చేరుకున్నారు. కొన్ని రోజుల తరువాత అనుమానితుల విచారణ ప్రారంభించి ప్రక్రియను ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా సీబీఐ అధికారులు పులివెందుల, కాణిపాకం, తిరుమల, కదిరి ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో ఆ బృందంలోని ఏడుగురు అధికారులు కరోనా బారినపడి ప్రస్తుతం కడప నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మిగతా అధికారులు దిల్లీ వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొందరు వెళ్లిపోగా, త్వరలోనే మరికొందరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఫలితంగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు తాత్కాలికంగా నిలిచిపోయింది. కరోనా బారినపడిన ఏడుగురు కోలుకుని కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతే విధుల్లో చేరనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని