మూడు జిల్లాలుగా విశాఖ! 

ఉత్తరాంధ్రలో మహానగరంగా విస్తరిస్తున్న విశాఖను పరిపాలనా సౌలభ్యం కోసం మూడు జిల్లాలుగా విడదీయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.

Published : 12 Nov 2020 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఉత్తరాంధ్రలో మహానగరంగా విస్తరిస్తున్న విశాఖను పరిపాలనా సౌలభ్యం కోసం మూడు జిల్లాలుగా విడదీయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. దీనికి సహకారం అందించేందుకు జిల్లా స్థాయి కమిటీ తన కసరత్తును పూర్తిచేసింది. అనకాపల్లి, అరకులో భవనాలు, వివిధ కార్యాలయాల కోసం భూములను గుర్తించే పని వేగంగా జరుగుతోంది. భౌగోళికంగా జిల్లాల సరిహద్దుల విభజన పూర్తిచేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.

నగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, గాజువాక, భీమిలి మాత్రమే విశాఖ జిల్లాలో ఉండనున్నాయి. అనకాపల్లి, చోడవరం, నర్నీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని తుని కలిపి అనకాపల్లి జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. దీని వల్ల ప్రస్తుత జిల్లాలోని మైదాన ప్రాంతం రెండుగా విడిపోనుంది. పారిశ్రామిక జిల్లాగా ఉన్న విశాఖలోని ఫార్మాసిటీ, అపెరల్‌ సిటీ, ఎన్‌టీపీసీ వంటివి భౌగోళికంగా అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అనువుగా ఉన్న భవనాలను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే చేశారు. రాష్ట్రస్థాయి కమిటీకి ఇచ్చేందుకు నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించేందుకు వీలుగా ఉన్న భూముల వివరాలను కూడా సేకరించారు.

ప్రస్తుత విశాఖ జిల్లాలో దాదాపు సగభాగం అటవీ ప్రాంతమే ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అరకు జిల్లాగా ప్రతిపాదిస్తున్నారు. అరకు, పాడేరు నియోజక వర్గాలతోపాటు జి.మాడుగుల కూడా దీని పరిధిలోకి తేనున్నారు. ప్రస్తుత జిల్లాలోని 11 గిరిజన మండలాలను అరకు జిల్లా పరిధిలోకి తెస్తారు. ఇప్పటికే పాడేరులో సబ్‌కలెక్టరు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, గిరిజన సహకార కార్పొరేషన్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి. 


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని