Tollywood Drugs Case: మరోసారి తెరపైకి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సమర్పించాల్సిందిగా

Updated : 11 Feb 2022 11:58 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సమర్పించాల్సిందిగా తెలంగాణ ఎక్సైజ్‌ శాఖకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) లేఖ రాసింది. డిజిటల్‌ రికార్డులు, కాల్‌ డేటా, సాక్షులు, నిందితుల వాంగ్మూలానికి సంబంధించిన వివరాలు అందజేయాలని లేఖలో ఈడీ అధికారులు కోరారు. ఈడీ అధికారులు అడిగిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. 

అసలేం జరిగిందంటే..

కొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకున్నారని, డ్రగ్‌పెడ్లర్‌ కెల్విన్‌తో వాటి లావాదేవీలు నిర్వహించారన్న అభియోగాల నేపథ్యంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఇప్పటికే పలువురిని పిలిచి విచారించిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్‌ శాఖ దీనికి సంబంధించి మొత్తం 12 కేసులను నమోదు చేయగా.. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ వాటి అభియోగ పత్రాలనూ సమర్పించి, ఈ కేసుల్లో సినీ ప్రముఖులకు సంబంధాలు లేవని తేల్చింది. ఈడీ కేసు మాత్రం ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. అయితే, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు సందర్భంగా సేకరించిన డిజిటల్‌ రికార్డులను ఇప్పటివరకు తమకు సమర్పించలేదని ఈడీ కొద్దిరోజుల క్రితం న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి గతంలో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ క్రమంలో డిజిటల్‌ రికార్డుల అంశం తెరపైకి వచ్చింది. తాము దర్యాప్తు చేస్తామంటూ ఈడీ ఇదివరకే కేసులో ఇంప్లీడ్‌ అయింది. ఈ క్రమంలో దర్యాప్తు వివరాల్ని ఈడీకి అప్పగించాలని న్యాయస్థానం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌లు, అభియోగపత్రాలను మాత్రమే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తమకు అప్పగించిందని, డిజిటల్‌ రికార్డుల్ని ఇవ్వలేదంటూ ఈడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. కేసుల్లో మనీలాండరింగ్‌ జరిగిందా? లేదా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఆ రికార్డులు తప్పనిసరి అని తెలిపింది. దీంతో వాటిని ఈడీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖకు ఈడీ లేఖ రాసింది.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని