రోడ్డు పక్కన తినేవారిని ‘తాజ్‌’ హోటల్‌కు తీసుకెళ్లాడు!

ఓ యువకుడు ఐదుగురు యాచక చిన్నారులను విలాసవంతమైన తాజ్ హోటల్లోకి తీసుకెళ్లాడు. వారికి మంచి భోజనం పెట్టించాడు.....

Published : 30 Oct 2021 01:04 IST

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో విలాసవంతమైన హోటల్ అది. అక్కడ టిఫిన్ చేయాలంటేనే భారీ మొత్తంలో చెల్లించుకోవాలి. మధ్యతరగతి వారు ఆ స్టార్ హోటల్‌కు వెళ్లేందుకు ఎంతో ఆలోచిస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం తనతోపాటు ఐదుగురు యాచక చిన్నారులను విలాసవంతమైన తాజ్ హోటల్లోకి తీసుకెళ్లాడు. వారికి మంచి భోజనం పెట్టించాడు. ఆ చిన్నారులతో సంతోషంగా గడిపాడు. ఆ హోటల్ దగ్గర వారిని కొన్ని ఫొటోలు తీసి మురిసిపోయాడు.

ముంబయికి చెందిన యశ్‌ అనే ఓ యువ వ్యాపారవేత్త.. యాచిస్తున్న పిల్లల ముఖంలో ఆనందం కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో కొందరు పిల్లలను హెలికాప్టర్‌ ఎక్కించాడు. తాజాగా ముంబయిలోని ప్రసిద్ధ తాజ్‌ హోటల్‌లో ఐదుగురు యాచక పిల్లలకు భోజనం పెట్టించాడు. ఆ పిల్లలకు తానే స్వయంగా వడ్డించాడు. రహదారి పక్కన యాచించడం.. పెద్ద భవనాలను, హోటళ్లను బయటి నుంచి చూడటం తప్ప లోపలికి వెళ్లడం ఆ పిల్లల ఊహకు అందని విషయం. అలాంటిది ఆ యువకుడు తమను స్టార్‌ హోటల్‌కు తీసుకువెళ్లడంతో చిన్నారులు ఆశ్చర్యపోయారు. తాజ్‌ లోపల ఉన్న ఖరీదైన సౌకర్యాలు, సామగ్రిని చూసి ఆ పిల్లలు నివ్వెరపోయారు. రుచికరమైన భోజనం చేసి మురిసిపోయారు. ఈ ప్రత్యేకమైన ట్రీట్‌ ఇచ్చి పిల్లల ముఖాల్లో ఆనందం చూసి యశ్‌ సంబురపడ్డాడు. ఆ తర్వాత హోటల్‌ మొత్తం చూపించాడు. వారితో ఫొటోలు దిగాడు. యశ్‌ తన వ్యాపారంలో వచ్చిన ఆదాయం నుంచి పేద పిల్లల కోసం ఇలా ఖర్చు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని