ఆ పులి కనిపిస్తే కాల్చేయండి..!

కర్ణాటకలోని కొడుగు జిల్లాలో అలజడి సృష్టిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పులిని కనిపిస్తే కాల్చి చంపేందుకు నాగర్‌హోళ్‌ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు....

Updated : 13 Mar 2021 11:10 IST

వారంరోజుల్లో నలుగురిని బలిగొన్న పెద్దపులి

బెంగళూరు: కర్ణాటకలోని కొడుగు జిల్లాలో అలజడి సృష్టిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో.. పులి కనిపిస్తే కాల్చి చంపేందుకు నాగర్‌హోళ్‌ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. గత వారం రోజుల్లో పులి రక్త దాహానికి నలుగురు బలయ్యారు. పెద్దపులిని చంపడంలో అధికారులు విఫలమైతే తామే చంపేందుకు అడవిలోకి వెళతామని కొడగు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

నాగర్‌హోళ్‌ అటవీ ప్రాంతంలోని తోటల్లో పనిచేస్తున్న కూలీలే లక్ష్యంగా పెద్దపులి దాడికి తెగబడుతోంది. పశువులు, ఇతర పెంపుడు జంతువులపై పంజా విసురుతోంది. వారం రోజుల వ్యవధిలో నలుగురిని బలితీసుకున్న పులి, మరో 16 పెంపుడు జంతువులను హతమార్చింది. ఐదు రోజుల క్రితం కూలీ పనికి వెళ్లిన ఓ కుటుంబంపై పంజా విసిరింది. పులి దాడిలో ఓ ఎనిమిదేళ్ల బాలుడు మృతిచెందగా ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాలుడి మరణంతో ఉలిక్కపడ్డ కొడగు జిల్లా ప్రజలు ఆ రక్తపిశాచిని చంపాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కొడగు రక్షణ వేదిక సహా ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్లపై బైఠాయించి పులిని చంపాలంటూ డిమాండ్‌ చేశారు. కొడగు రక్షణ వేదిక నేతృత్వంలో పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలు అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

కొడగు ఆందోళనల సెగ కర్ణాటక అసెంబ్లీని తాకింది. స్థానిక ఎమ్మెల్యేల ఆందోళనలతో పులి కనిపిస్తే కాల్చి చంపేలా కర్ణాటక అటవీశాఖ మంత్రి అరవింద్‌ లింబవళ్లి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు నాగర్‌హోళ్‌ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పశ్చిమ కనుమల్లో భాగంగా ఉన్న కీకారణ్యంలో పులి జాడ తెలుసుకునేందుకు ఏనుగుల సాయం తీసుకుంటున్నారు. తుపాకులు, మత్తు కలిగించే బాణాలు, ఈటెలను తమ వెంట తీసుకెళుతున్నారు. అధికారులు ఎక్కడికక్కడ ఎరలు సిద్ధం చేశారు. రక్తం మరిగిన పులి పట్టుబడక తప్పదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కనిపించిన వెంటనే దానిని బంధించడమో, చంపడమో చేస్తామని పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని