AAP: పాఠశాలలో తల్లి స్వీపర్‌.. ఎమ్మెల్యే హోదాలో ముఖ్య అతిథిగా కుమారుడు

పంజాబ్​ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి చరణ్‌జిత్‌ సింగ్‌ను ఓడించి అందరి దృష్టిని తనపైపు తిప్పుకున్నారు లభ్‌సింగ్​ ఉగోకే......

Updated : 06 Apr 2022 16:42 IST

చండీగఢ్‌: పంజాబ్​ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ తరపున మొదటిసారి పోటీ చేసి ఏకంగా సీఎం అభ్యర్థినే ఓడించి సంచలనం సృష్టించాడు లభ్‌సింగ్​ ఉగోకే. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్​జీత్​ సింగ్ చన్నీపై 37వేల మెజార్టీతో విజయం సాధించి, అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఆయన తల్లి ఇప్పటికీ పాఠశాలలో స్వీపర్​గా పనిచేస్తుండటం విశేషం. లభ్​సింగ్​ తాజాగా తన తల్లి గత 25 ఏళ్లగా పనిచేస్తున్న ఆ పాఠశాలకే ముఖ్యఅతిథిగా వెళ్లారు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

కొడుకు ఎమ్మెల్యేగా గెలుపొందినా తల్లి బల్దేవ్ కౌర్ మాత్రం ఇప్పటికీ స్వీపర్​ వృత్తినే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఏళ్ల తరబడి చేస్తున్న ఉద్యోగాన్నే కొనసాగిస్తున్నారు. కుమారుడు ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఇవేవీ పట్టించుకోకుండా ఆమె తన పని తాను చేసుకుపోతున్నారు. ‘లభ్‌సింగ్ కచ్చితంగా పంజాబ్​లో మార్పులు తీసుకొస్తాడు. ప్రజలకు వైద్యం, విద్య అందేలా చూస్తాడు. నా కొడుకు ఎమ్మెల్యే అయినా స్వీపర్‌ పనిని కొనసాగిస్తా’ అని తల్లి చెప్పుకొచ్చింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా తన కుమారుడు పనిచేయాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే తండ్రి దర్శన్ సింగ్ అన్నారు. లభ్‌సింగ్ చిన్నప్పుడు ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారని పాఠశాల హెడ్ మాస్టర్ అమ్రిత్​ పాల్ కౌర్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని