
AP: నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్న ప్రైవేటు ల్యాబ్‌లపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో డా. మల్లికార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలకు అధిక ఛార్జీలు వసూలు చేస్తే ప్రైవేట్ ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా రూ.499లనే ఛార్జ్ చేయాలన్నారు. కొత్తగా ఐసీఎంఆర్-ఎన్ఏబీఎల్ అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్‌లు వెంటనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ను సంప్రదించాలని.. ఎంఎన్ఎస్ పోర్టల్ లాగిన్‌లు పొందాలని సూచించారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపిన వెంటనే ఎంఎన్ఎస్ పోర్టల్‌లో ఫలితాల వివరాలు నమోదు చేయాలని వెల్లడించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్ రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాధితులు 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సీఈవో సూచించారు.