mucormycosis: పంజా విసురుతోంది

కరోనాకు తోడుగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు భయపెడుతున్నాయి. కొవిడ్‌-19 బాధితుల్లో చాలా మందితో బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ బయటపడుతోంది.

Published : 09 Jun 2021 01:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనాకు తోడుగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు భయపెడుతున్నాయి. కొవిడ్‌-19 బాధితుల్లో చాలా మందితో బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ బయటపడుతోంది. ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ ధాటికి దవడ ఎముక, కనుగుడ్లను సైతం కోల్పోవలసి వస్తుంది. ముక్కు నుంచి కంటికి, కంటి నుంచి మొదడుకి చేరుకునే ఫంగస్‌ చాలా మందిని మృత్యవు అంచువరకు తీసుకెళ్తోంది. చికిత్స ఆలస్యమయ్యే కొద్ది ఏకంగా ప్రాణాలే పోయేంతవరకూ రావడం ఇప్పుడు సర్వత్రా అందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌ ఫంగస్‌ గురించి మరింత సమాచారం మీకోసం..

కరోనాతో తల్లడిల్లుతున్న ప్రజలకు మరో ముప్పు ఎదురవుతోంది. బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో కొత్తవ్యాధి కలకలం రేపుతోంది. కరోనాను జయించామన్న ఆనందాన్ని ఇట్టే ఆవిరిచేస్తూ.. కరోనా విజేతల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతోంది. మ్యూకర్‌మైకోసిస్‌గా పిలిచే ఈ ఫంగస్‌ మన వాతావరణంలో సహజంగానే ఉంటుంది. ఇది మనుషులకు అరుదుగా సోకుతుంటుంది. ముఖ్యంగా కరోనా సోకిన వాళ్లలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు లేదా ఇమ్యూనిటీ వ్యవస్థ తీవ్రంగా స్పందించకుండా ఉపయోగించే స్టిరాయిడ్స్‌ వినియోగించిన వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అవయవ మార్పిడి జరిగినవారిలో, ఐసీయూలో చికిత్స పొందినవారిలో ఈ ఫంగస్‌ సోకే అవకాశం ఎక్కువ. గాలిపీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లోని సైనస్‌లోకి చేరతుంది. కొన్ని సందర్భాల్లో గాయాల ద్వారా కూడా శరీరంలోకి చేరుతుంటుంది. 
కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో మ్యూకర్‌మైకోసిస్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోదన మండలి (ఐసీఎంఆర్‌) తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మధుమేహం అదుపులో లేనపుడు, స్టిరాయిడ్స్‌ వినియోగం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయినపుడు, ఐసీయూలో సుదీర్ఘకాలం ఉన్నప్పుడు, అవయవ మార్పిడి, కీమో థెరపీ తీసుకున్నవారికి బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ముఖ్యంగా కొవిడ్‌ బారిన పడిన మధుమేహులకు బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు అధికంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, దవడ ఎముకలో నొప్పి, ముఖంలో ఒకవైపు నొప్పి, తిమ్మిరి, వాపు రావడం, ముక్కుపై నల్ల రంగు ఏర్పడటం, పంటినొప్పి, కంటినొప్పులు, చూపు మందగించడం, వస్తువులు రెండుగా కనిపించడం, జ్వరం రావడం, ఛాతిలో నొప్పి, శ్వాసకోశవ్యవస్థలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడం ఇవన్నీ బ్లాక్‌ ఫంగస్‌ తాలూకు అనుమానిత సంకేతాలని అంటున్నారు వైద్యులు.

ఇప్పటి వరకూ వచ్చిన నివేదికల ప్రకారం బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారు దాదాపు సగం మంది ప్రాణాలు కోల్పోయారు. మూడో వంతు మంది చూపును కోల్పోతున్నారు. కొంతమందిలో ముఖం వాపు, ముక్కు పూర్తిగా మూసుకుపోయినట్టు ఉండటం, కళ్ల వాపు వంటి లక్షణాలు, కీలక పరీక్షల్లో అవయవాల్లో నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన డయాబెటిక్‌ సమస్యతో బాధపడుతున్నవారు, కొవిడ్‌ నుంచి కోలుకోవడానికి స్టిరాయిడ్స్‌ ఔషధాలను వాడినవారిలో ఈ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ఫంగస్‌ ఊపిరితిత్తు్ల్లతో చేరినప్పుడు ఛాతిలో నొప్పి, ఊపిరి ఆడకపోవడం, దగ్గు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.  దీనిపై అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పలు సూచనలు చేసింది. ఈ ఫంగస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. దీని ముందుగానే గుర్తించి యాంటీఫంగల్‌ ఔషధాలను వాడితే బాధితులను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఈ బ్లాక్‌ ఫంగస్‌కు ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్స అందుబాటులో ఉన్నాయి. బ్లాక్‌ ఫంగస్‌కు సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లకు యాఫోటెరిసన్‌ బీ, ఎల్‌ఏఎంబీ వంటి యాంటీ ఫంగల్‌ ఇంజెక్షన్లను నాలుగు నుంచి ఆరువారాల పాటు ఇచ్చి డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడుతారు. 

బ్లాక్‌ఫంగస్‌ను నివారించడానికి మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత తరచుగా శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయులను పరిశీలించుకొంటూ ఉండాలి. స్టిరాయిడ్స్‌, యాంటిబయాటిక్‌ మందులను సహేతుకంగా ఉపయోగించాలి. ఆక్సిజన్‌ థెరపీ సమయంలో హ్యుమిడిఫైయర్స్‌ కోసం శుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి. దుమ్ముతో కూడిన నిర్మాణ ప్రాంతాలకు వెళ్లినపుడు తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకోవాలి.  మట్టి, ఎరువులాంటి పట్టుకునేటపుడు, తోటపని చేసేటపుడు బూట్లు, ఫ్యాంట్, పొడవు చేతుల చొక్కా వేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని